ఇటీవలి కాలంలో ఎలాంటి హంగామా లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద హిట్ కొట్టిన సూపర్ హిట్ చిత్రం కాంతార. గతేడాది సెప్టెంబర్‌లో భారీ అంచనాల నడుమ కన్నడలో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇక రిలీజైన ప్రతి భాషలో భారీ వసూళ్ళను సాధిస్తూ డబుల్ బ్లాక్‌బస్టర్ నిలిచింది . ఈ సినిమా కలెక్షన్‌ల పరంగానే కాదు అవార్డుల్లోనూ సరికొత్త రికార్డులను నెలకొల్పగా, ఇండియా తరపు నుండి ఆస్కార్‌కు నామినేట్ అయిన పది సినిమాల్లో ఒకటిగా కూడా నిలిచింది.
తాజాగా ఈ సినిమాకు పార్ట్-2 తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. గతంలో రిషబ్‌శెట్టి పార్ట్-2 తీసే ఉద్ధేశమే లేదని పలుసార్లు చెప్పాడు. కానీ ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడటంతో సెకండ్ పార్ట్‌ను ప్లాన్ చేస్తున్నాడట. అయితే సెకండ్ పార్ట్‌ను సీక్వెల్‌గా కాకుండా ప్రీక్వెల్‌గా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారని సమాచారం.. రెండో భాగంలో రిషబ్ తండ్రి జీవితం, ఆయన చనిపోయి ఎటెళ్లారు అనే అంశాలను చూపించబోతున్నట్లు టాక్. ఇందులో భాగంగానే రిషబ్ తాజాగా కర్ణాటకలోని కోస్టల్ ప్రాంతానికి వెళ్లాడట. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లి, వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి.
కాంతార ప్రీక్వెల్‌లో గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం, రాజు గురించి చూపిస్తామని విజయ్ కిరంగదూర్ తెలిపాడు. గ్రామస్తులతో పాటు భూమిని రక్షించడానికి రాజు ఏం చేశాడనేది తెర మీద చూపించనున్నామనిని పేర్కొన్నాడు. ‘‘సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం వర్షాధారిత వాతావరణం అవసరం కాబట్టి షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాగా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేయాలని అనుకుంటున్నాం. ‘కాంతార’ లో చూపించిన జానపదాన్ని అర్థం చేసుకోవడానికి రిషబ్ కర్ణాటక కోస్తా తీర ప్రాంతాల్లోని అడవుల్లో ప్రస్తుతం రెక్కీ నిర్వహిస్తున్నాడు. రెండో భాగానికి బడ్జెట్‌ను పెంచడంతో పాటు ఇందులో కొత్త నటీనటులని తీసుకుంటామని అన్నారు.