Kalyan Ram : ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. బాలయ్య ఒకసైడు, తారక్, కళ్యాణ్ రామ్ ఒకసైడు అన్న చందాన మారింది. ఇక ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా గురించి జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని.. అన్నదమ్ముల మధ్య విబేధాలు రావడం వల్లే ఇలా చేస్తున్నారని రూమర్లు వచ్చినట్టు తాజాగా ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్‌కు ప్రశ్న ఎదురైంది. దానికి పై విధంగా ఆయన స్పందించారు. తామిద్దరి బంధానికి కొలమానం ఒక ట్వీటు, ఒక ఈవెంట్‌కు రావడం అని ఎవరైనా అనుకుంటే మాత్రం.. మొదట ఆ ఆలోచనను మనసులో నుంచి తీసేసుకోవాలని సూచించారు.
ఇక తన కుటుంబంలో ఎవరెవరు ఉన్నారనేది కూడా సుస్పష్టంగా చెప్పేశారు. ఏపీ రాజకీయాలపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 2024లో ఏపీలో ఇప్పటి వరకూ కనీవినీ ఎరుగని ఎన్నికలు జరగబోతున్నాయి. నందమూరి తారక రామారావు ఉన్న సమయంలో కూడా అలాంటి ఎన్నికలు జరగలేదు. ఏపీ ప్రజలు ఓ పెద్ద యుద్ధాన్ని చూడబోతున్న సమయంలో మీరు కూడా చూస్తూనే ఉంటారా లేక ఎటైనా మద్దతిస్తారా అనేది కళ్యాణ్ రామ్‌ను ఓ ప్రశ్న అడగగా, దీనికి సమాధానంగా.. సినిమా వేరు..రాజకీయాలు వేరు, రాజకీయం అనేది ఓ బాల్ గేమ్ లాంటిది. ఈ గేమ్‌లో కళ్యాణ్ రామ్ ఒక్కడి నిర్ణయమే ఉండదు.
ఇది ఓ ఫ్యామిలీ విషయం. ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబంగానే తీసుకుంటాం. ఎటు ఎలా ప్రయాణించాలన్నా కలిసి నిర్ణయం తీసుకున్న తరువాత అటే వెళ్తాం అని చెప్పాడు. ఫ్యామిలీ అంటే మీరు, జూనియర్ ఎన్టీఆర్ అని అనుకోవాలా అనే మరో ప్రశ్నకు…ఫ్యామిలీ అంటే నేను తారక్ మాత్రమే. ఇంకెవరూ లేరు. కట్టకాలేవరకూ ఇద్దరం అన్నదమ్ములుగా ఒక కుటుంబంగా కలిసి ఉంటామని చెప్పుకొచ్చాడు. అయితే ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో కళ్యాణ్ రామ్ తన తాత పార్టీకి సపోర్ట్ అని చెప్పకుండా ఆలోచించి చెబుతామని అనడం తెలుగు తమ్ముళ్లకి మింగుడుపడడం లేదు.