Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ చూడ చక్కని అందంతోపాటు అద్భుతమైన నటనతో కుర్రకారు మనసులు దోచుకుంది. స్టార్ హీరోలందరితో కలిసి నటించిన కాజల్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. 2020 అక్టోబర్ నెలలో కాజల్-గౌతమ్ కిచ్లు వివాహం జరిగింది. రెండేళ్లకు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన కుమారుడితో ఆనంద క్షణాలని గడుపుతుంది. మరోవైపు ఈ అమ్మడు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో నటించేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో కాజల్‌ది పవర్‌ఫుల్ పాత్ర అని తెలుస్తుంది.
కాజల్ గత మూడేళ్లుగా కళరిపయట్టు అనే కేరళ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. సమయం దొరికినప్పుడల్లా కళరిపయట్టును నేర్చుకుంటున్నట్లు ఆమె తెలిపింది. మూడేళ్లుగా అడపాదడపా నేర్చుకుంటున్నట్టు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చిన కాజల్ అగర్వాల్ గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటుంది. ఎప్పుడో మొదలైన ఇండియన్ 2 చిత్రం పలు కారణాల వలన ఆగిపోగా, ఇటీవల తిరిగి ప్రారంభమైంది. 1996లో విడుదలైన కమల్ హాసన్ సూపర్‌హిట్ మూవీ భారతీయుడుకి ఇండియన్ 2 చిత్రం సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. దర్శకుడు శంకర్ దీనిని డైరెక్ట్ చేస్తున్నారు.
పెళ్లి తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌కి కాస్త గ్యాప్ ఇచ్చిన అమ్మడు.. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూనే సినిమాల్లో నటించడానికి రెడీ అయింది. ఇందులో భాగంగానే ఇండియన్ 2 సినిమా కోసం కాజల్ అగర్వాల్ కేరళ మార్షల్ ఆర్ట్ కళరిపయట్టుని ప్రాక్టీస్ చేసింది. ప్రాచీన భారతీయ యుద్ధ కళ అయిన కళరిపయట్టు శిక్షణలో బాగానే కష్టపడుతుంది. ఈ సినిమా హిట్ అయి కాజల్‌కి మంచి పేరు తీసుకొస్తే ఇక ఈ అమ్మడు వరుస సినిమాలు చేయడం ఖాయం అని అంటున్నారు.