Kadiyam Srihari : తెలంగాణలో రాజకీయం మంచి రంజుగా మారుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం కకావికలం అవుతుంది. పార్టీకి చెందిన ఒక్కొక్కరు మెల్లమెల్లగా జంప్ అవుతున్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి టైం వచ్చింది. ఆయన కూడా త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి జంప్ అవుతారనే టాక్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కుమార్తె కావ్య ఇప్పటికే తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెతో కలిసి ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. తండ్రీకూతుళ్లు కలిసి ఢిల్లీకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. శనివారం ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పెద్దలని కలుస్తారని ఆ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టాక్.
వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్‌లో కడియం చేరికతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. కడియం శ్రీహరి బీఆర్ఎస్‌ను వీడటం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ పార్టీకి గట్టి దెబ్బే తగిలే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య గురువారం రాత్రి ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ విషయంపై కావ్య లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, భూకబ్జాల వంటి ఆరోపణలతో పార్టీ ప్రతిష్ఠ మసకబారి, జనాదరణ కరువైన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కావ్య పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కడియం కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు తెలుస్తుది.
కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై కార్యకర్తలతో చర్చించి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కడియం శ్రీహరి నివాసానికి వచ్చి ఆయనతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, రోహిత్ చౌదరి, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి తదితరులు కడియం నివాసానికి వచ్చారు. కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకే కడియం శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చినట్టు దీపాదాస్ మున్షి తెలిపారు. కార్యకర్తలతో చర్చించి ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని కడియం శ్రీహరి చెప్పారు. వివిధ కారణాలతో నేతలు, ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీకి దూరం అవుతున్నారని కడియం శ్రీహరి అన్నారు. కడియం కుమార్తె కావ్యను వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించగా.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.