Kadiyam Srihari : పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలోను రాజకీయం మంచి రంజుగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరారు. రీసెంట్‌గా .. వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేత, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఆయన కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వగా.. తాజాగా ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేనని కేసీఆర్‌కు లేఖ రాశారు. బీఆర్ఎస్ పార్టీలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయని.. నేతలకు ఒకరంటే ఒకరికి పడటం లేదని లేఖలో వివరించారు.
బీఆర్‌ఎస్ నుంచి ఫిరాయించిన స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కాంగ్రెస్ పార్టీ బిగ్‌షాక్ ఇచ్చినట్టేనని ఆ పారీవర్గాల తాజా సమాచారం. తన కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఆశించి కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, కావ్యకు కాకుండా శ్రీహరి అభ్యర్థి అయితేనే టికెట్ ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం తాజాగా మెలిక పెట్టినట్టు తెలిసింది. అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి ఉంటుందనే షరతు పెట్టినట్టు కాంగ్రెస్ ఢిల్లీ వర్గాల తాజా సమాచారం. ఒకవేళ కడియం శ్రీహరి అందుకు అంగీకరించని పక్షంలో వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ లేక దొమ్మాటి సాంబయ్య పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
అయితే ఈ క్రమంలో కడియం శ్రీహరి.. తన పార్టీ అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ మార్పుపై వారితో చర్చించారు. గత 30 ఏళ్లుగా తనకు ఉండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలిపారు. అనుచరుల భవిష్యత్తు కోసమే తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగే పరిస్థితులు లేవని.. జిల్లా అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలో ఉండటమే మేలని అన్నారు. ఇలా పార్టీ మార్పుపై తన అభిప్రాయాన్ని కార్యకర్తలకు వెల్లడించారు. కడియం పార్టీ చేంజ్ గురించి త్వరలోనే ఓ ప్రకటన అయితే రానుంది.