Jayasudha : సహజ నటి జయసుధ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సినిమాలో కథానాయికగా తన సత్తా చూపించిన జయసుధ రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకుంటుంది. తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపనతో…రాజకీయాల్లో సినీ తారల స్పీడు పెరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో నటీనటులు కూడా భాగం అవుతూ రాజకీయ జీవితానికి కొత్త రంగులు తీసుకొస్తున్నారు. కొందరు వెను తిరగగా కొందరు మాత్రమే ఇక్కడ నిలదొక్కుకోగలిగారు. అలాంటి వారిలో నటి జయసుధ కూడా ఒకరు. సినీ రంగంలో తన భర్త డైరెక్ట్ చేసిన చిత్రాలు వరుస ఫ్లాపులు అవడంతో కష్టాలు పాలయిన ఈమె పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయారని అప్పట్లో చాలా వార్తలే వినిపించాయి. అలాంటి సమయంలో దివంగత రాజకీయ నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయసుధను తమ పార్టీలోకి చేర్చుకున్నారు.
అలా 2009 లో కాంగ్రెస్ పార్టీలో చేరి తొలుత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు టికెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తరవాత కొన్నాళ్ళకి టిడిపిలోకి చేరారు. వాస్తవానికి జయసుధకు నిరంతరం ప్రజా సేవ చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఈమె మెతక స్వభావం గల వ్యక్తి కావడంతో రాజకీయాల్లో పెద్దగా ప్రాధాన్యం పొందలేకపోతున్నారు అని ఓ వర్గం చెబుతున్న మాట. మళ్ళీ ఇపుడు ఈమె వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు. వైఎస్ జగన్ స్వయంగా ఆమెకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి జగన్, జయసుధకి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ కావడంతో అందరిలో ఆశ్చర్యం నెలకొంది.
అనారోగ్య సమస్యలతో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న చిన్నారులకు వైద్య సేవలు అందించడానికి ఇటీవల ఒక ట్రస్ట్ ను కూడా ప్రారంభించి సేవలు అందిస్తున్నారు జయసుధ. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జయసుధ సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఎన్నికల్లో ఓడిపోయారు. బీజేపీలో చేరేందుకు జయసుధ గతంలో ఒకసారి చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ నిర్మాతతో కలిసి జయసుధ బీజేపీ నేతలను కలిసినట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీ చేరికల కమిటీతో జయసుధ చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత జయసుధ పార్టీలో చేరికపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.