IPL : ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ నిర్వహణపై కాస్త సందిగ్ధత ఉంది. ఈ ఏడాది దేశంలో లోక్‍సభ ఎన్నికలు జరగనుండటంతో ఐపీఎల్‍ను బీసీసీఐ స్వదేశంలోనే నిర్వహిస్తుందా.. వేరే దేశానికి వేదికను మారుస్తుందా అనే దానిపై ఇంకా క్లారిటీ అనేది రావడం లేదు. ఎన్నికలు ఉన్నా భారత్‍లోనే ఈ ఏడాది ఐపీఎల్‍ను నిర్వహించేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని సమాచారం బయటికి వచ్చింది. మార్చి నుండి మే చివరి వారం దాకా జరగాల్సి ఉన్న ఈ మెగా లీగ్‌ను భారత్‌లో సాధారణ ఎన్నికల దృష్ట్యా విదేశాల్లో నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్నాహకాలు చేస్తున్నదని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఈసారి సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహించాలని శ్రీలంక ఇదివరకే భారత్‌ను కోరింది. ఈ నేపథ్యంలో అసలు ఐపీఎల్ భారత్‌లోనే జరుగుతుందా..? షిఫ్ట్ అవుతుందా..? అన్నదానిపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఐపీఎల్ షిఫ్టింగ్ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం భారత ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్ భారత్‌లోనే జరుగుతుందా..? లేక షిఫ్ట్ అవుతుందా..? అనేది సెంట్రల్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ నిర్ణయించాల్సి ఉంది. అయితే ఏ విషయమైనా చర్చల తర్వాతే తెలుస్తుంది..’ అని అన్నాడు.
ఇక వచ్చేనెల నుంచి మొదలుకానున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను ఈసారి రెండు నగరాల్లో నిర్వహించనున్నట్టు శుక్లా స్పష్టం చేశాడు. గత సీజన్‌లో ఒక్క ముంబైలోనే జరిగిన మ్యాచ్‌లను ఈసారి బెంగళూరు, ఢిల్లీలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‍ను మార్చి 22వ తేదీన ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే, లోక్‍సభ ఎన్నికల షెడ్యూల్‍ను బట్టి తుది నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ వెల్లడించాక ఈ విషయంపై స్పష్టత రానుంది.లోక్‍సభ ఎన్నికల వల్ల 2009 ఐపీఎల్ సీజన్‍ను దక్షిణాఫ్రికాలో నిర్వహించింది బీసీసీఐ. అయితే, 2014, 2019లో ఎన్నికలు ఉన్నా.. భారత్‍లోనే ఐపీఎల్‍ను జరిపింది. మరి.. ఇప్పుడు 2024లో ఐపీఎల్‍ను స్వదేశంలోనే నిర్వహిస్తుందా.. లేదా వేరే దేశానికి తరలిస్తుందా అనేది వేచిచూడాలి.