IND Vs SA : తిరువనంతపురంలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ విలవిలలాడిపోయారు. ఈ క్రమంలోనే ఆ జట్టు స్వల్ప స్కోరును మాత్రమే చేయగలిగింది. దాన్ని భారత్ అలవోకగా సాధించింది. సౌతాఫ్రికాపై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేశారు. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో కేశవ్ మహరాజ్ (41 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వాయ్‌నె పార్నెల్ (24 పరుగులు, 1 ఫోర్, 1 సిక్సర్) మినహా ఎవరూ చెప్పుకోదగిన స్కోరు చేయలేదు. కాగా భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, హర్షల్ పటేల్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ నిదానంగా ఆచి తూచి ఆడింది. దీంతో 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్‌లు రాణించారు. 56 బంతులు ఆడిన రాహుల్ 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే మరో బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా, నోర్‌జె చెరొక వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ 3 టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో రెండో టీ20 అక్టోబర్ 2వ తేదీన రాత్రి 7 గంటలకు అస్సాంలోని గౌహతి స్టేడియంలో జరగనుంది.