Ind Vs Ban 2023 Asia Games : ఏషియన్ గేమ్స్ క్రికెట్ లో భారత్ అదరగొడుతుంది. ఇటీవల స్పెయిన్‌పై మంచి విజయం సాధించిన భారత్.. ఈ రోజు సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ను 96 పరుగులకే కట్టడి చేసింది . స్పిన్నర్లు సాయి కిశోర్, వాషింగ్టన్ సుందర్ చెలరేగడంతో బంగ్లా టీమ్ కుదేలైంది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 96 రన్స్ మాత్రమే చేసింది. సాయి కిశోర్ 3, సుందర్ 2 వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, షాబాజ్ అహ్మద్, తిలక్ వర్మ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కి పిచ్ అంతగా సహకరించకపోవడంతో నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.
ఐదో ఓవర్లో 18 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయిన ఆ టీమ్.. మళ్లీ కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. 21 పరుగుల దగ్గర వరుసగా రెండు వికెట్లు పడటంతో బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. తర్వాత 36, 45, 58, 65, 81, 96 పరుగుల దగ్గర వరుసగా వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్లు బంగ్లా టీమ్ ను కట్టడి చేశారు. సాయి కిశోర్ 4 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. తిలక్ వర్మ 2 ఓవర్లలో కేవలం 5 రన్స్ ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. స్పిన్నర్స్ చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్ కనీసం వంద పరుగులు కూడా చేయలేకపోయింది.
స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. ఈజీగా ఆ లక్ష్యాన్ని అందుకున్నది. 9.2 ఓవర్లలోనే టార్గెట్‌ను చేధించింది. రుతురాజ్ 40, తిలక్ వర్మ 55 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచారు. తిలక్ వర్మ 26 బంతుల్లో 2 ఫోర్లు 6 సిక్సులతో 55 పరుగులు చేశాడు.. ఫైనల్ లో పాకిస్తాన్ లేదా ఆఫ్గనిస్తాన్ తో ఇండియా పోటీ పడనుంది. ఫైనల్‌లోను భారత్ అదరగొడుతుందని, మనకు బంగారు పతకం దక్కడం ఖాయమని కొందరు జోస్యం చెబుతున్నారు. మరోవైపు టీమిండియా మెయిన్ క్రికెటర్స్ వరల్డ్ కప్ టోర్నీతో బిజీగా ఉండగా, ఆ టోర్నీలో మనోళ్లు రాణించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.