ICC World Cup 2023 SL Vs AFG : ఐసీసీ వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ఇప్పటికే పలు పసికూన జట్లు పెద్ద జట్లకు షాకిచ్చాయి. అందులో భాగంగానే ఆఫ్గనిస్థాన్ ఇది వరకే పాక్, ఇంగ్లండ్‌లను మట్టి కరిపించింది. ఇక తాజాగా సోమవారం పూణెలో జరిగిన మ్యాచ్ లోనూ ఆఫ్గన్లు తమ సత్తా చాటారు. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని సునాయాసంగా ఎలాంటి తడబాటు లేకుండా ఛేదించారు. ఈ క్రమంలో సెమీస్‌పై శ్రీలంక జట్టు పెట్టుకున్న ఆశలపై ఆఫ్గన్ ప్లేయర్లు నీళ్లు చల్లారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లంకకు సెమీస్ వెళ్లే అవకాశం లేకుండా చేశారు.
కాగా మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్గనిస్థాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక తడబడుతూ ఆడింది. ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చింది. దీంతో ఆ జట్టు 49.3 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ నిస్సంక మినహా ఎవరూ రాణించలేదు. 60 బంతులు ఆడిన నిస్సంక 5 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. ఇక ఆఫ్గన్ బౌలర్లు ముందు నుంచి పొదుపుగా బౌలింగ్ చేశారు. ఆఫ్గన్ బౌలర్లలో ఫజల్‌హక్ ఫరూకీ 4 వికెట్లు పడగొట్టగా ముజీబ్ ఉర్ రహమాన్ 2 వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఒమర్‌జై, రషీద్ ఖాన్‌లకు చెరొక వికెట్‌దక్కింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్గనిస్థాన్ నెమ్మదిగా ఆడుతూ శ్రీలంకపై ఒత్తిడి పెంచింది. వికెట్లను ఎక్కువగా కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. ఆచి తూచి ఆడుతూ ఆఫ్గన్ ప్లేయర్లు తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ క్రమంలో ఆఫ్గనిస్థాన్ జట్టు 45.2 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 242 పరుగులు చేసింది. ఆఫ్గన్ బ్యాట్స్‌మెన్‌లలో రహ్మత్ షా (62, 74 బంతుల్లో 7 ఫోర్లు), అజ్మతుల్లా ఒమర్‌జై (73 నాటౌట్, 63 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), హష్మతుల్లా షాహిది (58 నాటౌట్, 74 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్)లు అద్భుతంగా రాణించారు. లంక బౌలర్లలో దిల్షాన్ మదుశంక 2 వికెట్లు తీయగా, కసున్ రజితకు 1 వికెట్ దక్కింది. కాగా ఈ మ్యాచ్‌లో విజయంతో ఆఫ్గనిస్థాన్ పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది.