ICC World Cup 2023 : రేపటి నుండి వన్డే ప్రపంచకప్ 2023 మహాసంగ్రామం మొదలు కానుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా దీని గురించే చర్చ. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా టీమిండియాబరిలోకి దిగబోతోంది. ఈ ప్రపంచకప్ భారతదేశానికి చాలా పేరు తేవడం పక్కా అని చెప్పవచ్చు. దీనికి మొదటి కారణం మెగా టోర్నమెంట్‌ని నిర్వహించడం. రెండో కారణం.. చరిత్రలో తొలిసారిగా భారత్ మాత్రమే ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఇది మాత్రమే కాదు.. ఈసారి ప్రపంచ కప్‌లో అభిమానులు త్రిబుల్ డోస్ థ్రిల్‌ను చూడగలరు. మెగా టోర్నమెంట్‌లో 3 కొత్త రూల్స్ ఉన్నాయి. ఇవి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేయబోతున్నాయి.
గతంలో ఎన్నడూ జరగని కొన్ని సంఘటనలు ఈ ప్రపంచకప్‌లో చోటుచేసుకోనున్నాయి. ఈ హోస్టింగ్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా భారత్ ఒంటరిగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. గతంలో భారత్ 1987, 1996, 2011లో వన్డే ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చింది. ఇక వన్డే ప్రపంచకప్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ టోర్నీలో వెస్టిండీస్ జట్టు శాశ్వత జట్టుగా కొనసాగుతోంది. కాని వన్డే ప్రపంచకప్ చరిత్రలో కరీబియన్ జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. 1975, 1979లో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలో ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ ఈసారి అర్హత సాధించలేకపోవడం అందరిని ఆశ్చర్యపరచింది.
మునుపటి ప్రపంచ కప్‌లో అంటే 2019 ప్రపంచ కప్‌లో బౌండరీ కౌంట్ నియమం చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ఆడించేవారు. అయితే టై అయితే ఆ మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టును విజేతగా ప్రకటించారు. ఈ నిబంధన కారణంగా న్యూజిలాండ్ జట్టు తొలిసారి ప్రపంచకప్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. గత ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా, మ్యాచ్ టై అయింది. అనంతరం సూపర్ ఓవర్ ఆడగా, అది కూడా టై అయింది. ఈ క్రమంలో ఏ జట్టు ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లండ్ జట్టును ఛాంపియన్‌గా ప్రకటించారు.
దీనిపై విమర్శలు రాగా, ఐసీసీ ఈ నిబంధనను మార్చింది. ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ మ్యాచ్ ఆడతారు. అది కూడా టై అయితే ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్‌ని నిరంతరం నిర్వహిస్తారు. ప్రపంచకప్ వేదికల్లో గ్రాస్ పిచ్ లను సిద్ధం చేయాలని , సరిహద్దు దూరం 70 మీటర్ల కంటే తక్కువ ఉండకూడదనే నిబంధనను కూడా జారీ చేసింది. ఇక ఐసీసీ ఈ ఏడాది జూన్ నుంచి సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను రద్దు చేసింది. అంటే ఈ సాఫ్ట్ సిగ్నల్ రూల్ ఈ వరల్డ్ కప్ లో కనిపించదు.