తిరుమల భక్తులకి చిరుత కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. అలిపిరి కాలినడక మార్గంలో వెళ్లే భక్తులపై చిరుత దాడి చేస్తుండడం కలవరపరుస్తుంది. తాజాగా ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో బాలిక మృతి చెందింది. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో చిన్నారి లక్షిత కుటుంబ సభ్యులు అలిపిరి కాలినడక మార్గంలో శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11 గంటలకు వారు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. అయితే కుటుంబ సభ్యులకి కొంత ముందు నడుస్తున్న బాలికపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు గట్టిగా అరవడంతో అడివిలోకి ఈడ్చుకొని వెళ్లింది.
వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకి సమాచారం అందించారు. అయితే రాత్రి సమయం వలన గాలింపు చర్యలు సాధ్యం కాలేదు. శనివారం ఉదయం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలోనే బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని చిరుత సగం తినేసినట్లు తెలుస్తోంది. బాధితులది నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెం అని తెలుస్తోంది. చిరుత దాడిలో మృతి చెందిన బాలిక మృతదేహాన్ని తిరుపతిలోని రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. చిన్నారి లక్షి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారి లక్షిత తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల చిరుత నోట చిక్కిన చిన్నారి అనూహ్యంగా ప్రాణాలతో బయటపడడం మనం చూశాం. జూన్ నెలలో రాత్రిపూట తిరుమల అలిపిరి నడక దారిలో కొండకు వెళ్తున్న ఓ చిన్నారిపై చిరుత దాడి చేసింది. నడక మార్గంలో వస్తున్న బాలుడిని నోట చిక్కించుకుని అడవిలోకి పరుగులు తీసింది. దాంతో చిరుత వెంటే స్థానికులు అరుపులు కేకలతో వెంటపడ్డారు. అప్పటికే బాలుడిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లిపోయింది. ఈ ఘటనలో స్థానికుల అప్రమత్తత బాలుడి ప్రాణాలు కాపాడింది. బాలుడి తల్లిదండ్రులు, ఇతర భక్తులు, భద్రతా సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.