Ganta Srinivasa Rao : మరి కొద్ది రోజులలో ఏపీలో ఎలక్షన్స్ జరగనున్న విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ఏడు జాబితాల్లో సమన్వయకర్తల్ని ప్రకటించింది. అవసరమైన చోట్ల మార్పులు, చేర్పుల చేస్తోంది. ఇటు టీడీపీ, జనసేన కూటమి కూడా సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తోంది. అయితే విశాఖ జిల్లాకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి ఏకంగా జిల్లానే మారిపోబోతున్నారని ప్రచారం మొదలైంది.గంటా శ్రీనివాసరావు ఈసారి విజయనగరం జిల్లా నుంచి పోటీ చేయబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. నెల్లిమర్ల నుంచి బరిలోకి దిగుతారని సోషల్ మీడియాలో టాక్ వచ్చింది. అయితే ఆ స్థానాన్ని జనసేన పార్టీ కోరుతోందంట.
అందుకే గంటాకు విజయనగరం జిల్లాలోనే చీపురుపల్లి నుంచి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంటా అయితే మంత్రిపై సరైన అభ్యర్థి అని భావిస్తున్నారట.. అందుకే ఆ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఉత్తరాంధ్ర తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆ తాజా, మాజీ మంత్రులు మధ్య టగ్ ఆఫ్ వార్ కి ఆపరేషన్ చీపురుపల్లి రెడీ అయింది. తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ కు చెక్ పెట్టేందుకు గంటా శ్రీనివాసరావు ను టీడీపి బరి లోకి దించేందుకు సిద్ధమైంది.
ఇద్దరూ కాపు సామాజిక నాయకులు కావడం, ఇద్దరూ ఉత్తరాంధ్రలో కీలక నేతలు గా ఉండటం తో టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బొత్స పై గంట పోటీ అధికారికంగా ప్రకటించకపోయినా, విస్తృతమైన చర్చ మాత్రం నడుస్తుంది.. ఉత్తరాంధ్ర లో బొత్సను ఢీ కొట్టాలంటే గంట సరైన అభ్యర్థి గా టీడీపి భావిస్తోంది. దీంతో పార్టీ వ్యూహ రచన చేస్తుంది అనే ప్రచారం ఉంది.. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి నాలుగు సార్లు పోటీ చేసిన బొత్స మూడు సార్లు విజయం సాధించారు. ఈ సారి మళ్లీ చీపురుపల్లి నుండి బొత్స పోటీ చేయబోతున్నారని వైసిపి వర్గాల మాట. మరోవైపు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ ఎంపిగా పోటీ చేయనున్నారు.