Gaddar Son : ప్రజా పోరాటాలకు తన పాటలతో ఊపిరిపోసిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ మనలని వదిలి వెళ్లిపోయారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గద్దర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని శోకసంద్రంలోకి నెట్టింది. గద్దర్ మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు గద్దర్‌కు నివాళి అర్పించారు. గద్దర్ అంటే ఎంతో అభిమానం చూపించే జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గద్దర్ మరణవార్త విని షాక్ కు గురయ్యారు. కొద్ది రోజుల క్రితమే అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్‌ను పవన్ పరామర్శించారు. స్వయంగా అక్కడకు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
గద్ధర్‌ని కలిసిన కొన్నిరోజులకే ఆయన ఇలా కన్నుమూయడంతో పవన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతిక కాయానికి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాడ సానుభూతి తెలిపారు. గద్దర్ కుమారుడిని ఓదారుస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు పవన్ కళ్యాణ్. ప్రజా గాయకుడు గద్దర్ గారు మరణించారంటే నమ్మశక్యం కావడం లేదు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన్ని పరామర్శించేందుకు కొద్ది రోజుల క్రితమే వెళ్ళాను. తమ్ముడా… అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఆయన్ని చివరిసారిగా కలిసినప్పుడు ‘నీ అవసరం నేటి యువతకు ఉంది’ అంటూ నాకు చెప్పిన మాటలు ఎన్నటికీ మరువలేనివి.
![Gaddar Son : గద్దర్ కుమారుడిని కౌగిలించుకొని కన్నీరు పెట్టిన పవన్ కళ్యాణ్ Gaddar Son cried with pawan kalyan](http://3.0.182.119/wp-content/uploads/2023/08/gaddar-son.jpg)
‘మా భూమి’ చిత్రంలో ఆయన గానం చేసిన ‘బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి…’ అనే చైతన్య గీతం అజరామరం. నా చిన్నతనంలో విన్న ఆ గీతమే నాకు గద్దర్ అనే పేరును పరిచయం చేసింది. గద్దర్ అనగానే గజ్జె కట్టి గళమెత్తి.. కెరటంలా దుమికే ఆ రూపమే గుర్తుకు వస్తుంది. గానం చేసేటప్పుడు ఆయన ఆంగికం, ఆహార్యాన్ని నేటి తరం పోరాట గాయకులు అనుసరిస్తున్నారు. ‘నీ పాదమ్మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ… తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ..’ అనే పద ప్రయోగం ఊహకు అందనిది.. అనిర్వచ నీయమైనది. విప్లవ గీతాలను ఎంత సునాయాసంగా రాయగలరో.. భావుకత నిండిన గీతాలను అంతే అలవోకగా రాయగలరనిపించింది. తెలంగాణ ఉద్యమ కాలంలో తన కలం, తన గళంతో ఆయన నిర్వర్తించిన పాత్ర విస్మరించలేనిది. గద్దర్ గారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఓ ప్రకటనలో పవన్ తెలిపారు.