Free Travel In RTC Buses : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. మార్పు కోరుకున్న నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్‌ని కాదని రేవంత్ రెడ్డిని కొత్త సీఎంగా ఎన్నుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమ ప్రభుత్వం వచ్చేందుకు ఆరు గ్యారెంటీల అమలుకు సిద్ధమైంది.. ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసేందుకు సిద్ధమైంది. శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేస్తామని.. శనివారం (డిసెంబర్ 9) నుంచి అమలు చేయాలని తొలి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు తీసుకొస్తుందన్న చర్చ జరుగుతోంది. కర్ణాటకలో ఇప్పటికే అమలవుతున్న కండిషన్‌లను ఇక్కడ కూడా అమలు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఉచిత బస్సు ప్రయాణం అమలు విధివిధానాలు పకడ్బందీగా రూపొందేవరకు మహిళలు తమ ఆధార్ కార్డును చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని చెప్పింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చు. అయితే కొన్ని సర్వీసులకే దీనికి పరిమితం చేస్తారా? గరుడ వంటి ఆధునిక బస్సు సర్వీసుల నుంచి దీనిని మినహాయిస్తారా? అన్నది ఇంకా తేలలేదు. నిన్న జరిగిన తొలి కేబినెట్ లోనూ దీనిపై చర్చించి రేపటి నుంచి ఉచిత బస్సు ప్రయాణ హామీని అమలు పర్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీకి ఆదేశాలు నేడు పంపనున్నారు. విధివిధానాలు కూడా నేడు ఆర్టీసీకి చేరనున్నాయి.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి క్యాబినెట్ సమావేశం హాట్ హాట్ గా సాగింది. విద్యుత్ శాఖ రివ్యూలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం సీరియస్ అయ్యారు. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని అభిప్రాయపడ్డారు. రేపటిలోగా పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారు. సీఎండీ ప్రభాకర్‌రావు రాజీనామాను ఆమోదించవద్దని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా, రేపు విద్యుత్ శాఖపై చర్చించనున్నారు. విద్యుత్ శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు.