Former Governor Narasimhan : ఇటీవల తుంటికి ఆపరేషన్ జరిగి కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్‌ను గత కొద్ది రోజులుగా పలువురు పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శించారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న నరసింహన్ దంపతులను మాజీ మంత్రి కేటీఆర్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న నరసింహన్.. త్వరలో పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ అభివృద్ధిలో నరసింహన్ అందించిన సహకారం, రాష్ట్ర ఏర్పాటు, అనంతర పరిణామాలు, ఇతర అంశాలపై ఈ సందర్భంగా ఇరువురు చర్చించుకున్నారు. నరసింహన్ దంపతులకు కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మ పట్టు వస్త్రాలిచ్చి సంప్రదాయ పద్ధతిలో అతిథి మర్యాదలు చేశారు. క్రమంగా కోలుకుంటున్న కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా ఆరోగ్యవంతులు కావాలంటూ ఆకాంక్షించారు. కాగా, కేసీఆర్ నివాసానికి వచ్చిన నరసింహన్ దంపతులకు కేటీఆర్ స్వాగతం పలికారు.. కార్యక్రమంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్, కొప్పులఈశ్వర్, ఎంపీ సంతోష్ కుమార్, బీబీ పాటిల్ పాల్గొన్నారు.
అంతకుముందు నందినగర్ నివాసానికి చేరుకున్న నరసింహన్, విమల దంపతులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (KTR) పుష్పగుచ్ఛం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. దగ్గరుండి వారిని లిఫ్టులో పైఅంతస్తుకు తీసుకెళ్లారు.నాడు కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి ఈ సందర్భంగా కేసీఆర్, నరసింహన్ మధ్య చర్చకు వచ్చింది. ఈ క్రమంలో గవర్నర్ హోదాలో నాడు నరసింహన్ అందించిన సంపూర్ణ సహకారానికి కేసీఆర్ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.ఇక ఇదిలా ఉంటే కేసీఆర్ అధికారంలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉండడమే డేంజర్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహాక సమావేశం సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు కేటీఆర్. రాబోయే రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజలకు మధ్యకు వస్తారని చెప్పారు. సీఎం అనే రెండక్షరాల కంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలు చాలా పవర్‌ఫుల్ అన్నారు. ఖమ్మం వంటి ఒకటి, రెండు జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలే సాధించిందన్నారు. ఖమ్మంలో నేతల మధ్య ఆధిపత్య పోరే ఓటమికి కారణమన్నారు.