Pat Cummins : ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ కమ్మిన్స్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. గత ఏడాది తమ టీమ్‌కి వరల్డ్ కప్ అందించిన ఈ ఆటగాడు ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఉన్నాడు. ప్యాట్ కమ్మిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా 20.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్‌రమ్ స్థానంలో కెప్టెన్‌గా నియమించింది. తన అంచనాలకు తగ్గకుండా ప్యాట్ కమ్మిన్స్ రాణించాడు. 17 వికెట్లు తీయడంతో పాటు 147.36 స్ట్రైక్ రేట్‌తో 112 పరుగులు కూడా రాబట్టాడు.అయితే ఫైనల్‌లో మాత్రం కాస్త తడబడడంతో సన్‌రైజర్స్ జట్టు కప్ అందుకోలేకపోయింది. ఇటీవల ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతోంది.
భారత అభిమానులు బిచ్చగాళ్లని ప్యాట్ కమిన్స్ అన్నాడని కొందరు ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన నెటిజన్లు ఈ ప్రచారానికి తెరలేపారు. కానీ ఆ వీడియోలో ప్యాట్ కమిన్స్ ఎక్కడ కూడా బిచ్చగాళ్లు అనే పదం ఉపయోగించలేదు. చాలా మంది భారత అభిమానులు డబ్బు సాయం కోసం తనను సంప్రదిస్తున్నారని మాత్రమే చెప్పాడు.భారతీయ అభిమానులు తమ ఆసుపత్రి బిల్లులను తన అడ్రస్‌కు పంపుతున్నారని పాట్ కమిన్స్ ఓ ఇంటర్య్వూలో చెప్పాడు. తరచుగా భారతీయ అభిమానులు ఆపరేషన్లు, ఇతర చికిత్సల కోసం డబ్బు సాయం చేయాల్సిందిగా తనకు మెసేజ్‌లు పంపుతున్నారని , ఇది చాలా అసాధారణమని, తనను కలవరపెడుతోందని కమిన్స్ వివరించాడు.
కమిన్స్ ఈ మాటల్లో ఎక్కడా బెగ్గర్ అన్న మాట వాడకపోయినప్పటికీ దానిని స్మితీ పేరుతో వీడియను షేర్ చేసి , కమిన్స్ ఇండియన్స్ ను బెగ్గర్స్ అన్నాడు అన్న క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ గా మారటంతో భారతీయ అభిమానులు మండిపడుతున్నారు. కరోనా సమయంలో ప్యాట్ కమిన్స్.. భారత ప్రధాన సహాయనిధికి 50 వేల డాలర్లను విరాళంగా ఇచ్చాడు. ఆ సమయంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఈ డబ్బును ఖర్చు చేయాలని కమిన్స్ కోరాడు. ఈ సాయంతో కమిన్స్‌ను గొప్పవాడిగా భావించిన కొందరు భారత అభిమానులు.. తమకు సాయం చేయాలని రిక్వెస్ట్ చేసి ఉండవచ్చు అని అంటున్నారు.