Actor Kantha Rao : కత్తి కాంతారావు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కాంతారావు 400 సినిమాల్లో నటించాడు. కేవలం జానపద చిత్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటించిన పలు పౌరాణిక చిత్రాలలో ఆయన స్నేహితుడిగా కనిపించారు. ఎన్టీఆర్ సైతం నారదుడి పాత్రలో కాంతారావు నటన చూసి తాను ఆ వేషం వేయనని శపథం చేశారంటే… కాంతారావు ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. డబ్బు కోసం నిర్మాతలను అసలు ఇబ్బంది పెట్టని కథానాయకుడు కాంతారావు. అటువంటి హీరోను పరిశ్రమ పట్టించుకోకపోవడం ఆయన అభిమానులకు బాధ కలిగిస్తోంది.
కాంతారావు 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి మూలంగా హైదరాబాదులో ని యశోద హాస్పిటల్ లో రాత్రి గం 9.50 ని.లకు కన్నుమూశారు. ఇప్పుడు కాంతారావు ఫ్యామిలీ చాలా దీనావస్థలో ఉంది. ఆర్థికంగా చాలా దీనావస్థలో కాంతారావుగారి కుటుంబం ఉంది. అంత గొప్పగా ఎదిగి నిలిచిన రావు గారి కుటుంబం ఇప్పటికి అద్దె ఇంట్లోనే . ఆస్తులు లేవు.ఓ ఇంటర్వ్యూలో కాంతారావు కూతురు సుశీల తన తండ్రికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మా నాన్నగారికి అప్పట్లోనే 400 ఎకరాలు ఉండేది. కొత్త సినిమా వస్తే స్నేహితులతో కలిసి వెళ్లే వారు. ఆ డబ్బు కోసం ఎకరం అమ్మేశారు. అప్పుడు ఎకరం ధర 1200.
ఇక నాన్న సినిమాల్లోకి వచ్చి .. నిర్మాతగా మారే సమయానికి ఒక 50 ఎకరాలు ఉండేవనుకుంటా. అప్పుడు సినిమాలు తీయడం వలన నష్టాలు రావడంతో వాటిని అమ్మేశారు. ఇక వాటిని అమ్మిన తర్వాత అటువైపు సాగర్ కాలువ పడింది. దాంతో రేట్లు పెరిగాయి. కాని అప్పటికే చాలా భూమిని అమ్మేయడంతో చాలా బాధ అనిపించింది. నాన్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు సినిమా వాళ్ల కన్నా అభిమానులు ఎక్కువగా ఆదుకున్నారు. ఆయన ప్రాణం పోతున్నప్పుడు అందరం దగ్గరే ఉన్నాం. అమ్మని తాను జాగ్రత్తగా చూసుకుంటానని అన్నయ్య చెప్పినప్పుడు, ఆయన కళ్లవెంట నీళ్లు చెంపల మీదుగా జారడం ఇప్పటికీ నేను మరచిపోలేను. మా అమ్మ అమాయకురాలు కావడంతో చివరి రోజులలో ఆమె గురించే ఎక్కువగా బాధ పడ్డారు అని సుశీల పేర్కొంది.