Dil Raju : కొన్నాళ్లుగా థియేటర్స్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సినిమా థియేటర్స్ కి ఆడియన్స్ రావట్లేదని గగ్గోలు పెడుతున్నారు. అందులో ముఖ్య కారణాలు పెరిగిన టికెట్ రేట్లు ఒకటి అయితే ఇంకోటి సినిమాలు థియేటర్లో రిలీజయిన తర్వాత త్వరగా ఓటీటీలోకి వచ్చేయడం. ఇటీవల చిన్న సినిమాలు వారం రోజులకే ఓటీటీలోకి వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా మూడు, నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. థియేటర్లలో వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఓటీటీలో సినిమాలు వస్తుండడంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతోంది. అయితే ఇదే విషయమై తాజాగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రేక్షకులు థియేర్లకు రాకుండా వాళ్లను తామే చెడగొట్టామని చెప్పుకొచ్చారు. థియేటర్లలో వచ్చిన నాలుగు వారాలకే సినిమాను ఓటీటీలోకి తీసుకురావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఓటీటీలోకి త్వరగానే వచ్చేస్తుంది సినిమా అంత రేట్లు పెట్టుకొని థియేటర్ కి వెళ్లడం ఎందుకు అని చాలా మంది అనుకుంటున్నారు. దీనిపై టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నా ఫలితం లేదు. చిన్న సినిమా అని వదిలేయకండి. థియేటర్ కి వెళ్లి చూడండి. ఇటీవల చాలా మంది థియేటర్ కి వచ్చి సినిమాలు చూడట్లేదు. నాలుగు వారాల్లో సినిమా ఓటీటీలోకి వస్తుంది అని మేమే వాళ్ళని చెడగొట్టి ఆడియన్స్ ని థియేటర్స్ కి రాకుండా చేసుకున్నాము అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి.
కమిటీ కుర్రోళ్ళు లాంటి సినిమాలు మెల్లగా జనానికి ఎక్కుతాయి. మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు థియేటర్స్ లో కొనసాగితే ఎన్ని రోజులు అయిన ప్రేక్షకులు చూస్తారని దిల్ రాజు అన్నారు.ఇప్పటికే బాలీవుడ్ లో హిందీ సినిమాల రిలీజ్ విషయంలో నిబంధనలు కాస్త కఠినతరం చేశారు. ఏ సినిమా అయిన 50 రోజుల తర్వాతనే ఓటీటీలో రిలీజ్ చేయాలని అక్కడ మల్టీప్లెక్స్ ఓనర్స్ కండిషన్స్ పెట్టడంతో కాస్త థియేటర్ యాజమాన్యానికి ఉపశమనం లభించింది. మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలలో కూడా సినిమాలు ఓటీటీ రిలీజ్ విషయంలో కొత్తగా నిబంధనలు తీసుకొచ్చారు. మరి తెలుగులో కూడా అలాంటి పరిస్థితులు రావాలని కొందరు నిర్మాతలు కోరుకుంటున్నారు.