తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా ఒకరు. దాదాపు 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడిగా గిన్నిస్ రికార్డులో కూడా స్థానం సంపాదించుకున్నారు. అటు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించి ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు దాసరి నారాయణరావు. తెలుగు సినిమా ప్రస్థానం ఉన్నన్ని రోజులు కూడా దాసరి నారాయణరావు పేరు వినిపిస్తూనే ఉంటుంది.
ఒక దర్శకుడుగా ఎంతో మంది హీరోలను, నిర్మాతగా ఎంతో మంది దర్శకులను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు దాసరి. కేవలం దర్శకుడుగానే కాకుండా నటుడుగా కూడా తెలుగు, తమిళ, కన్నడ భాషలో నటించిన తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం దాసరి నారయణరావు గారే అంటూ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పటికీ కూడా చెబుతుంటారు. అలా ఎంతోమంది నటులను హీరోలుగా నిలబెట్టిన దాసరి నారాయణరావు జీవితంలో ఒక కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది.
దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్ కుమార్ ను 1998 లో గ్రీకువీరుడు చిత్రం ద్వారా దాసరి హీరోగా పరిచయం చేశాడు. ఆ తర్వాత అరుణ్ కుమార్ కొన్ని చిత్రాలలో నటించిన కూడా ఒక్క సినిమా కూడా అరుణ్ కుమార్ కి హీరో ఇమేజ్ ని తెచ్చిపెట్టలేకపోయాయి. అరుణ్ కుమార్ కనీసం నటుడిగా కూడా ఇండస్ట్రీలో స్థిరబడలేకపోయాడు. దాంతో అరుణ్ కుమార్ పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. ఇక తన తనయుడు సినిమాలలో సక్సెస్ అవ్వలేకపోయాడన్న దిగులు తనకు ఎప్పటికీ ఉండేదని దాసరి ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు. ఇక చివరికి దాసరి కోరిక తీరకుండానే 2017 మే 30వ తేదీన అనారోగ్య సమస్యతో కన్నుమూశారు.