Daggubati Purandeshwari : ప్రస్తుతం ఏపీలో రాజకీయం రంజుగా మారుతుంది.ఒకరిపై ఒకరు అవాకులు పేల్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఈ సారి జగన్‌ని అధికారంలోకి రానివ్వకుండా చేయాలని టీడీపీతో, బీజేపీతో జతకట్టారు జనసేనాని. పురంధేశ్వరి కూడా జగన్‌పై కామెంట్స్ విసురుతూ తనదైన పంచ్‌లతో ప్రచారంలో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఓ సభలో పవన్ కళ్యాణ్ పక్కన ఉండగా, జగన్‌పై తనదైన శైలిలో పంచ్‌లు విసిరింది. ఫ్యాన్ స్పీడ్ చూస్తే ఒకటి, రెండు, మూడు, నాలుగు ఉంటుంది. అదే 151 పెడితే ఎలా ఉంటుందో మనం చూస్తూన్నాం. అంత స్పీడ్ పెట్టి ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా మనం చేసుకున్నాం. అందుకే ఈ సారి అలాంటి ఫ్యాన్ మళ్లీ రాకుండా చేయాలని పురంధేశ్వరి అన్నారు.
ఏపీలో ట్రిబుల్ ఇంజన్ పాలన అవసరమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.సమన్వయ కమీటీలు ఏర్పాటు చేసుకుని మూడు పార్టీల క్యాడర్‌ను ఎన్నికల్లో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. ఏపీలో ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. ఏపీలో కొత్త పరిశ్రమలు రావటం లేదని చెప్పారు. మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు, ఎస్సీలకు సీఎం జగన్ రెడ్డి అన్యాయం చేశారని విరుచుకుపడ్డారు.. దళిత డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును జగన్ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని మండిపడ్డారు.
గోదావరి ప్రక్షాళన కోసం కేంద్రం రూ.57 కోట్లు మంజూరు చేసినా వైసీపీ ప్రభుత్వం ఎందుకు పనులు చేపట్టలేదని ప్రశ్నించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిరుపయోగంగా మార్చారని దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పురంధేశ్వరి పంచ్‌లు విసురుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ తెగ నవ్వేశారు. కాగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇన్‌ఫ్లూయెంజాతో బాధపడుతున్నారని.. క్రేన్ గజమాలలు, ఫోటోలు, సెల్ఫీలు వద్దంటూ జనసేన నాయకత్వం కార్యకర్తలకు సూచించింది. రోజూ ఏదో ఒక సమయంలో పవన్ కళ్యాణ్‌కు జ్వరం వస్తోందని అందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపింది.