Crispy Fish Fry : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది అనేక రకాల వంటలను చేసుకుంటుంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే సీజన్లను బట్టి కూడా నాన్ వెజ్ ప్రియులు తాము తినే ఆహారాలను మారుస్తుంటారు. అందులో భాగంగానే ప్రస్తుతం మృగశిర కార్తె సీజన్ నడుస్తుంది కనుక చేపలను ఎక్కువగా తింటున్నారు. అయితే చేపలను అందరూ తినలేరు. ముళ్లు ఉంటాయని భయపడతారు. కానీ చేపలను ఇలా క్రిస్పీగా ఫ్రై చేస్తే.. ఇష్టం లేని వారు సైతం రెండు ముక్కలను ఎక్కువగానే తింటారు. ఈ ఫ్రై ని చేయడం కూడా చాలా సులభమే. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ చేపల ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చేప ముక్కలు – 4 లేదా 6, కార్న్ ఫ్లోర్ – 1 కప్పు, కాశ్మీరీ కారం – 1 టీస్పూన్, వెల్లుల్లి ముద్ద – 1 టీస్పూన్, ఉల్లిపాయ ముద్ద – 1 టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి ముద్ద – అర టేబుల్ స్పూన్ (కారం కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు), మిరియాల పొడి – 1 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, కారం – 1 టీస్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, కరివేపాకు – 2 రెమ్మలు, పచ్చి మిర్చి – 2 (సన్నగా, నిలువుగా తరగాలి), నిమ్మరసం – 1 టీస్పూన్, జీలకర్ర పొడి – 1 టీస్పూన్.
క్రిస్పీ చేపల ఫ్రై తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, కాశ్మీరీ కారం, వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముద్ద, పచ్చి మిర్చి ముద్ద, మిరియాల పొడి, ఉప్పు, కారం, నిమ్మరసం, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. దీన్ని మెత్తని మసాలా పేస్ట్‌లా చేయాలి. దీన్ని చేప ముక్కలకు రెండు వైపులా బాగా పట్టించాలి. తరువాత చేప ముక్కలను 2 నుంచి 3 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. దీంతో ముక్కలకు మసాలా బాగా పట్టి చక్కగా మ్యారినేట్ అవుతాయి. తరువాత ఒక పాన్ తీసుకుని అందులో చేప ముక్కలు మునిగేలా నూనె పోయాలి. నూనె కాగిన తరువాత చేప ముక్కలను అందులో వేసుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
అనంతరం ముక్కలను బయటకు తీయాలి. తరువాత కరివేపాకు రెమ్మ, చీల్చిన పచ్చి మిర్చి ముక్కలను వేసి అదే నూనెలో వేయించాలి. అనంతరం వాటిని అంతకు ముందు ఫ్రై చేసిన చేప ముక్కలపై వేసి గార్నిష్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన క్రిస్పీ చేపల ఫ్రై రెడీ అవుతుంది. దీన్ని నేరుగా తినవచ్చు. లేదా పప్పు, సాంబార్ వంటి ఇతర ఆహారాలతో నంజుకుని తినవచ్చు. ఇలా చేప ముక్కలను ఫ్రై చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు.