Cricket World Cup 2023 : అక్టోబర్ 5 నుండి భారత్ లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని జట్లు మెగా టోర్నీ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. టోర్నీలో పాల్గొనే 10 జట్లలో తొమ్మిదింటి పరిస్థితి బాగానే ఉన్నా.. పాకిస్థాన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు పాకిస్తాన్ వన్డే ప్రపంచకప్ ఆడేది కూడా అనుమానంగానే మారింది.భారత్‌లో మ్యాచ్‌లు ఆడడం గురించి పాకిస్తాన్ పూటకో మాట మారుస్తుంది. తొలుత భారత్ లో ఆడేందుకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదని ప్రకటించింది. ఇప్పుడు కొన్ని మ్యాచ్ లకు సంబంధించిన వేదికలను మార్చాలని ఐసీసీకి చెప్పింది. అది వర్కౌట్ కాలేదు.
దాంతో భారత్ లో ప్రపంచకప్ ఆడే నిర్ణయం తమ దేశ ప్రభుత్వానికి వదిలేస్తున్నట్లు.. వారు అనుమతి ఇస్తే ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఇక పాక్ క్రీడా శాఖ మంత్రి ఎహ్సాన్ మజారీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని చెప్పిన ఆయన.. ఆసియా కప్ మ్యాచ్ లను భారత్ తటస్థ వేదికల్లో ఆడాలని డిమాండ్ చేసింది.. ఇప్పుడు తాము కూడా ప్రపంచకప్ లో పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లను తటస్థ వేదికల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాని సెహబాజ్ షరీఫ్ ఇప్పటికే ఒక అత్యున్నత కమిటీని వేశాడు.

వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పాల్గొనడంపై ఈ కమిటీ చెప్పేదే తుది నిర్ణయం అని అన్నాడు. చూస్తుంటే వీరు చివరికి వరకు ఇలానే దోబూచులాడబోతున్నారని అర్ధమవుతుంది.భారత్ వేదికగా అక్టోబర్ – నవంబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు పోటీ పడనున్నాయి. మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టు ఈసారి టోర్నీకి అర్హత కూడా సాధించకపోవడం క్రికెట్‌ప్రియులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.