CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఫామ్ హౌజ్‌కే ఎక్కువగా పరిమితం అయ్యారు. ఆయన అసెంబ్లీకి రావడం లేదు, ప్రత్యేక సభలలో కనిపించడం లేదు. ఎక్కువగా కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రైతు ధర్నాలు చేస్తున్నారు. రైతు రుణమాఫీని సంపూర్ణంగా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వం రైతులపై అక్రమ కేసులు పెట్టి అణిచివేసే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ అన్నారు.
రైతుల రుణమాఫీ విషయంతో సీఎం రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయట పడింది. మోసం రేవంత్ రెడ్డిది, పాపం కాంగ్రెస్ పార్టీది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నడు. ఏ ఊర్లో నైనా వంద శాతం రుణమాఫీ అయిందా? అని ప్రశ్నించారు. ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. రుణమాఫీ మొత్తం కాలేదని, తెలంగాణ ప్రజలను కాపాడాలని యాదగిరిగుట్ట నర్సింహ స్వామిని వేడుకున్నాని చెప్పారు. ఆగస్టు నెల వచ్చినా ఊర్లల్లో చెరువులు నింపడం లేదు. రైతుబీమా, రైతుబంధు ఇచ్చి చెరువులు నింపిన ఘనత కేసీఆర్‌ది అన్నారు.
రేవంత్ రెడ్డి చేసిన పాపాన్ని క్షమించాలంటూ పంతులుగారి ద్వారా స్వామివారికి విన్నవించుకున్నానంటూ హరీష్ రావు కామెంట్ చేయగా, దీనిపై కాంగ్రెస్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్‌లో స్పందిస్తూ, “మీ మేనమామ చేసిన పాపాలను క్షమించమని కోరుతూ గుళ్ళు గోపురాలు తిరగలేదు ఎందుకు? నాడు కేసీఆర్ పాపాల పల్లకి మోసిన నువ్వు, నేడు కేటీఆర్ పల్లకి ఎక్కడ మోయాల్సి వస్తదోనని తల్లడిల్లుతున్నావు. కేసీఆర్ పాపాలు పండి ఆ పార్టీ అధ్యక్ష పదవి, ప్రతిపక్ష నేత పదవి పోతే.. నువ్వు ఆ కుర్చీని ఎక్కి, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయొచ్చని ఎదురుచూస్తున్నావు. అందుకే మీ మేనమామ చేసిన పాపాలకు పరిహారం చేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది,” అని ట్వీట్ చేస్తూ హరీష్ రావు ఫోటో పెట్టి ‘యాదాద్రి దేవాలయం సాక్షిగా మీరు అవినీతి చేయలేదని ప్రజలకు చెప్పగలరా?’ అంటూ అద్దిరిపోయే కౌంటర్ వేసింది.