CM YS Jagan : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలను సమస్యలపై స్థానికులు నిలదీస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా వైసీపీకి అనుసంధానమైన ఐప్యాక్ బృందం సర్వే నిర్వహించింది. జనంలో అసంతృప్తి ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు 40 మంది ఉన్నట్లు జాబితా సిద్ధం చేసినట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ పార్టీ నేతల అంచనా ప్రకారం.. ఆ 40 మందిలో జిల్లాకు సంబంధించి చిత్తూరు, పలమనేరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, వెంకటేశ్ గౌడ ఉన్నట్లు సమాచారం.
ఇక ఐప్యాక్ సర్వే ప్రకారం జగన్‌కి ఈ సారి ప్రజలు చెక్ పడతారని, టీడీపీనే గెలిపిస్తారని అంటున్నారు. పలువురు నేతలు వైసీపీని వీడి ఇతర పార్టీలలోకి వెళుతుండడం కూడా జగన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తుంది. . విశాఖపట్నానికి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ.. వైసీపీని వీడి జనసేనలో చేరారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా వైసీపీ అధినాయకత్వంపై మండిపడ్డారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఐదేళ్లుగా ఎంతో పనిచేశానని, గడపగడపకు తిరిగానని, అయినా ఇప్పుడు టికెట్ ఇవ్వట్లేదని చెప్పడమేంటని ప్రశ్నించారు. దళితుడిగా తాము ఏం కర్మ చేసుకున్నామంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు.
జీడీనెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి, నగరిలో రోజాకు వారి నియోజకవర్గాల్లో బలమైన వ్యతిరేక వర్గాలు తయారయ్యాయి. ఈసారి వారికి టిక్కెట్లు ఇస్తే పనిచేయమని, వారి వ్యతిరేక వర్గ నాయకులు పలువురు బహిరంగంగా చెప్పేస్తున్నారు. నారాయణస్వామితో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్‌బాబుకు గడప గడప.. కార్యక్రమాల్లో నిత్యం నిలదీతలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల సమయానికి ఐప్యాక్ ఇచ్చే జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయోననే ఆందోళన ఎమ్మెల్యేల్లో లేకపోలేదు. చూడాలి మరి రానున్న రోజులలో ఇంకెన్ని మార్పులు చేర్పులు వైసీపీలో చోటు చేసుకుంటాయనేది.