CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎంత వాడివేడిగా సాగిందో మనం చూశాం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ.. పూర్తిగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధంగా మారడం అందరిని ఆశ్చర్యపరచింది. గవర్నర్ ప్రసంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిరంకుశ పాలనగా అభివర్ణించడాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఖండించారు. ఈ క్రమంలో మొదలైన మాటల తూటాల పర్వం.. ఆసాంతం విమర్శలు, ప్రతివిమర్శలతో హీటెక్కింది. అయితే.. కేటీఆర్‌ను ఎన్ఆర్ఐ అని.. ఆయనది మేనేజ్ మెంట్ కోటా అంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే దానికి కేటీఆర్ స్పందిస్తూ.. తనది మేనేజ్ మెంట్ కోటా అయితే.. రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా అని, అసలైన ఎన్ఆర్ఐ అయిన సోనియాగాంధీని పార్టీ అధ్యక్షురాలిని చేసిన విషయాన్ని రేవంత్ మర్చిపోయినట్టున్నారంటూ కౌంటర్ అటాక్ చేశారు కేటీఆర్.
రైతు బీమా, పంట బీమాకు తేడా తెలియని సీఎం అని.. రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని, ఢిల్లీ నామినేట్ చేసిన సీఎం అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక.. హరీశ్ రావు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా సీఎం స్థాయిలో మాట్లాడలేకపోతున్నారని.. ఇక టీపీసీసీ అధ్యక్షుడిగానే మాట్లాడుతున్నారని.. ఎన్నికల ప్రచారంలో చేసినట్టుగానే విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రైతు రాజ్యమని చెప్పిన గత ప్రభుత్వం… ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపిన రైతులను అరెస్ట్ చేసి వారికి బేడీలు వేసి అమానుషంగా కోర్టుకు తీసుకు వెళ్లినందుకు సిగ్గుపడాల్సిందే అన్నారు.
పన్నెండో తరగతి ప్రశ్నాపత్రాలు సరిగ్గా దిద్దలేక… ప్రయివేటు వ్యక్తులకు కాంట్రాక్టు పద్ధతిన ఇవ్వడంతో పాతికమంది పిల్లలు చనిపోయినందుకు సిగ్గుపడాల్సిందే అన్నారు. పదో తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించలేనందుకు, టీఎస్‌పీఎస్సీ పరీక్షలు జిరాక్స్ తీసి అమ్ముకున్నందుకు, 30 లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయేలా చేసినందుకు… ఇలా అన్నింటికీ సిగ్గుపడాల్సిందే అని రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం పీక్స్‌కి వెళ్లింది.