CM Revanth Reddy : ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం వేడెక్కిపోతుంది. కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను కాపాడుకునేందుకు కేసీఆర్ బీజేపీకి లొంగిపోయారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని అన్నారు. నారాయణపేటలో కాంగ్రెస్ జనజాతర భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. కేటీఆర్, హరీశ్‌రావును చూస్తే.. బీఆర్ఎస్ ‘బిల్లా రంగా సమితి’ అనిపిస్తుంది అని అన్నారు.
పాలమూరు ప్రజలు ఇచ్చిన అండతో దేశంలోని మోదీ, రాష్ట్రంలోని కేడీతోనైనా కొట్లాడతాను. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడి నుంచి వంశీచందర్ రెడ్డిని ఎంపీగా, జీవన్ రెడ్డిని పాలమూరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించండి’’ అని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను ఆగస్టు 15లోపు మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ముదిరాజ్ లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లో చేర్చేందుకు పోరాడుతామని అన్నారు. మాదిగల వర్గీకరణ జరగాల్సిందేనని అన్నారు. అందులో ఏ, బీ, సీ, డీ వర్గీకరణలు చేయాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర జనాభాలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు 10 శాతం మంది ఉంటే.. కేసీఆర్ కేవలం ఒక్కరికి మాత్రమే సీటు ఇచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
ముదిరాజ్ లను పట్టించుకోనందుకే ప్రజలు కేసీఆర్ ను వంద అడుగుల గోతి తీసి పాతాళంలో పాతి పెట్టారని వ్యాఖ్యలు చేశారు. పదవి పోయి మతి భ్రమించి బీఆరెస్ నాయకులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. 3650 రోజులు అధికారంలో ఉన్న కేడీ, మోదీ రాష్ట్రానికి ఏం చేశారు. పాలమూరులో విద్య కోసం వైద్యం కోసం.. ఉద్యోగాల కోసం ఉపాధికోసం.. సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. సీఆర్ పదేళ్లు సీఎం గా ఉండొచ్చు.. మోదీ పదేళ్లు ప్రధానిగా ఉండచ్చు. కానీ పేదోళ్ల ప్రభుత్వం.. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆరునెలల్లో పడగొడుతారట. విజ్ఞులు ఆలోచన చేయాలి… దుర్మార్గ రాజకీయాలను పాతరేయాలి. ఒక పాలమూరు రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే చూసి ఓర్వలేకపోతున్నారా? పాలమూరు బిడ్డలకు అర్హత లేదా? ఆ హక్కు లేదా? టచ్ చేసి చూడండి.. మా పాలమూరు బిడ్డలు అగ్ని కనికలౌతారు అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.