CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారా అన్న ప్రశ్నకు కూడా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తనపై నిందలు వేయడానికి ఎలాంటి కారణాలు లేవు కాబట్టి నేను బీజేపీలో చేరతాను అంటూ ప్రచారం చేస్తున్నారని రేవంత విమర్శించారు. తెలంగాణలో నేతలు మాట్లాడుతున్న భాషపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ ఆ పదవికి తగ్గ భాష మాట్లాడటం లేదని కేసీఆర్ చేసిన విమర్శలను ప్రస్తావించగా.. తాను అలా మాట్లాడేందుకు ఆద్యుడు కేసీఆరే అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడితేనే తాను తిరగబడి మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు. దెబ్బతాకిన కోలుకున్న తరువాత బయటకొచ్చిన కేసీఆర్.. నోటికొచ్చినట్లు మాట్లాడారు. పచ్చి బూతులు తిట్టారు. అందుకే.. తాను కూడా అదే భాషలో కేసీఆర్‌కు సమాధానం చెప్పానని రేవంత్ వివరణ ఇచ్చారు. తానెప్పుడూ ముందు మాట్లాడనని.. ఎవరైనా అంటేనే రెండు మూడు రోజులు చూసి ఆ తరువాత వాళ్ల సంగతి ప్రజల సమక్షంలోనే తేలుస్తానని చెప్పారు. ‘జూన్ 4 తరువాత రాజకీయంగా స్టెబిలిటీ వచ్చేస్తుంది. ఎన్నికల ప్రక్రియ అయిపోగానే.. ముఖ్యమంత్రిలాగే వ్యవహరించి.. రాష్ట్రాన్ని చక్కదిద్ది.. ప్రజల కోసం కమిట్‌మెంట్‌తో పని చేస్తాను. డిసెంబర్ 3 కంటే ముందున్న రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 7 నుంచి మార్చి 17 వరకు వంద రోజుల రేవంత్ రెడ్డిని మీరు చూశారు.
మార్చి 17 నుంచి పార్టీ ప్రెసిడెంట్‌గా నడుచుకుంటున్నాను. ప్రధాని మోదీ వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడుతారు. ఆయన స్థాయిలో ఆయన మాట్లాడే భాష లేదు కదా.. అమిత్ షా భాష ఆయన లెవల్లో లేదు కదా. ఈ స్టేట్ నుంచి నేనే కదా కౌంటర్ ఇవ్వాల్సింది. ఈ స్టేట్‌కు వచ్చి మాట్లాడుతుందే నా గురించి.. టార్గెట్ చేస్తుందే నన్ను. నేను వెనక్కి తిరిగి కౌంటర్ ఇవ్వకపోతే ఏమంటారు. రేవంత్ భయపడిపోయాడు. వెనక్కి తగ్గాడని అంటారు. టెంపర్‌మెంట్‌తో పాటు.. పార్టీ కేడర్‌లో ప్రోత్సాహం కల్పించాలి. కేసీఆర్ వల్లే.. ఇప్పుడు ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. జూన్ 4 తరువాత ఆ పరిస్థితి ఉండదు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. జగన్కి కూడా కేసీఆర్ తెగ సపోర్ట్ చేస్తున్నారు. వారి వారికి మధ్య ఏవో నడుస్తున్నాయని అన్నారు.