Seethakka : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిన విషయం మనందరికి తెలిసిందే. ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు. ఈమె అసలు పేరు అనసూయ దంసారి. సీతక్కగా పరిచయమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలపై పోరాడుతూ.. నియోజకవర్గాల్లో స్వయంగా పర్యటిస్తూ అభివృద్దికి పాటుపడుతుంటారు. అందుకే ఆమెను పేద ప్రజల పెన్నిధి అంటారు.
సీతక్క వరంగల్ జిల్లా ములుగు మండలం.. జగన్నపేట గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో జులై 9, 1971 లో జన్మించింది. తండ్రి సమ్మయ్య, తల్లి సమ్మక్క దంపతులకు ఆమె రెండో సంతానం. సీతక్క ములుగు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ.. పదవ తరగతి వరకు చదువుకున్నారు. చిన్ననాటి నుంచే ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం మొదలు పెట్టారు.ఆమె 1988 లో నక్సల్ పార్టీలో చేరారు. అప్పుడు సీతక్క వయసు 14 ఏళ్లు, పదవ తరగతి చదువుతున్నారు. నక్సల్స్ లో చేరిన తర్వాత ప్రజలకు న్యాయం చేయాలనే తన ఆకాంక్షను నెరవేర్చడం ప్రారంభించారు. అలా అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం పదిహేనేళ్ళకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు. తన బావ శ్రీరాముడిని పెళ్లి చేసుకొని తన పేరు సీతక్కగా మార్చుకున్నారు. కొడుకు పుట్టిన తర్వాత దళంలో ఉండలేక 1996 లో జనజీవన స్రవంతిలోకి కలిసిపోయారు.
అయితే సీతక్క బిడ్డ పెళ్లికి రేవంత్ రెడ్డి సాయం చేశాడనే ప్రచారం జోరుగా సాగింది. ఆ సమయంలో సీతక్క స్పందిస్తూ ఆయన తనవంతు సాయం అందించారు. అయితే మేము ఖర్చు పెట్టాం అంటున్నారు. కాని మేము ప్రజలకి భోజనం పెట్టేందుకు ఎక్కువ ఖర్చు చేశాం తప్ప పెద్దగా ఏమి చేయలేదు. పట్టు చీరలు, నగలు వంటి వాటికి మేము ఎక్కడ ఖర్చు చేయలేదు అని సీతక్క క్లారిటీ ఇచ్చింది. ఇక కరోనా సమయంలో చాలా మంది నేతలు ఇళ్లకే పరిమితం అయ్యారు.. కానీ సీతక్క తన ప్రాణాలు లెక్క చేయకుండా, ప్రభుత్వ సహాయం లేకుండా తన నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతూ అహారం, నిత్యవసర వస్తువులు స్వయంగా అందజేశారు. ఒక ప్రజా ప్రతినిధి అంటే ప్రజల కోసం పని చేయాలని నిరూపించారు. అప్పట్లో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురిశాయి.