CM Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయా పార్టీ నాయకులపై బీఆర్ఎస్ నాయకులపై దారుణమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. డైలీ బేసిస్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పదే పదే విమర్శలు చేయటం.. పలు ఘాటు వ్యాఖ్యలు చేస్తుండటం , కేటీఆర్ కు తోడుగా మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మరికొందరు గులాబీ నేతలు విమర్శలు చేస్తున్న వేళ.. తాజాగా జరిగిన ఒక బహిరంగ సభలో తీవ్రస్వరంతో హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్. మూడునెలలకో.. ఆర్నెల్లకో ప్రభుత్వం పడిపోతుందని.. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారంటూ ఎవరైనా అంటే పళ్లు రాలగొడతామన్న ఆయన.. ‘‘ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది?’’ అంటూ సీరియస్ అయ్యారు.
“నీ అయ్య..ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేంది. ఎవడ్రా కొట్టేది. మీ ఊళ్లో ఎవడన్నా.. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చూస్తే.. వేప చెట్టుకు కోదండం వేసి కొట్టండి. లాగులో తొండలు విడవండి“ అని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రజలు తమను ఆదరించారని.. గుండెల్లో పెట్టుకున్నారని..ప్రజల మాండేట్‌కు విరుద్ధంగా కొందరు గుంటనక్కలు ఇలా కారు కూతలు కూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలపైనా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇలాంటివారిని తరిమి కొట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు. ఏదేదో అంటున్నారు. అలాంటి వారు ఊర్లల్లోకి వస్తే తగిన బుద్ధి చెప్పండి“ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
2012కు ముందు చెప్పిన మాట ప్రకారం అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని రేవంత్ తెలిపారు. ఆ కృతజ్ఞతతోనే పదేళ్ల ఆలస్యం అయినా కూడా.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఇప్పుడు అధికారం అప్పగించారని చెప్పారు. అలాంటి ప్రజల మాండేట్‌ను కూడా కూల్చే ప్రయత్నాలు చేస్తారా? అని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా పాలన సాగిస్తామన్నారు. ఇకపై తనపై రోజువారీగా చేసే విమర్శలకు ఒక్క సభలో వాటన్నింటికి సమాధానమిచ్చారు. ‘‘కేసీఆర్ ను నేరుగా అడుగుతున్నా. ఎప్పుడైనా అదిలాబాద్ జిల్లా ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించారా? నిజంగా డెవలప్ మెంట్ చేస్తే నీళ్ల కోసం, నాగోబా గుడి కోసం, రోడ్ల కోసం నిధులు మేం ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు ఉంటుంది?’’ అంటూ లాజిక్ గా ప్రశ్నించారు.