CM KCR : మరి కొద్ది రోజులలో జరగనున్న తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈసారి ఎన్నికల బరిలో నేరుగా సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును ఢీకొట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వం.. ఈ మేరకు వారిపై బలమైన అభ్యర్థులను నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో కేసీఆర్.. గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని సీఎం బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది.
అయితే కేసీఆర్ కి పోటీగా 120 మంది నిలుచోబోతున్నట్టు సమాచారం. కామారెడ్డిలో కేసీఆర్‌కి చెక్ పెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు. కామారెడ్డి అసెంబ్లీ బరిలో రైతులు నిలపడనున్నారు. లింగాపూర్‌లో ఎనిమిది గ్రామాల మాస్టర్ ప్లాన్ బాధితులు సమావేశం అయి.. 120మంది నామినేషన్లు వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఉద్యమం ఉధృతం చేస్తామని బాధితుల హెచ్చరిస్తున్నారు. ఇక రైతుల నామినేషన్లతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.. తమ భూములను కాపాడుకోవడమే తమ లక్ష్యమని చెబుతున్న రైతులు మాస్టర్ ప్లాన్ రద్దు చేశాకనే కామారెడ్డిలో అడుగుపెట్టాలని సూచిస్తున్నారు. కామారెడ్డిలోని వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు పారిశ్రామిక జోన్‌ను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు.
వందలాది ఎకరాలను బదలాయించే మాస్టర్‌ప్లాన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ పసుపు రైతులు కవితకి షాక్ ఇచ్చారు. పసుపు బోర్డు తీసుకురావడంతో కవిత విఫలమయ్యారంటూ ఆమెకు వ్యతిరేకంగా 180 మంది రైతులు నామినేషన్ వేయడం అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే.. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపూరి అరవింద్ చేతిలో కవిత ఓటమి పాలు కాగా, రైతులు వ్యతిరేకించడంతోనే కవిత ఓడిపోయారని అప్పట్లో తీవ్రమైన చర్చ నడిచింది. మరోవైపు తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లకు గట్టి పోటీనిచ్చేందుకు సీనియర్లను రంగంలోకి దింపుతున్నట్లు ఏఐసీసీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.