CM Chandra Babu : డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు ఎలక్ట్రిక్ సైకిళ్లను సబ్సిడీతో అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్‌ఎల్) సిఇఒ విశాల్ కపూర్ ప్రతిపాదించడం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు.. ఆయన సుదీర్ఘ ప్రసంగాన్ని గమనిస్తే ఒక విషయం స్పష్టం అవుతుంది. ఆయన టెక్నాలజీని ఉపయోగించి, ఆ ప్రయోజనాలను ప్రజలకు కల్పించేందుకు ప్లాన్స్ వేస్తుంటారు. తాజాగా అదే విషయాన్ని బయటపెట్టారు. టీడీపీ గుర్తు అయిన సైకిళ్లను సబ్సిడీ ధరలకు ఇస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఆలోచిస్తున్నారు. ఐతే.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.
అవి మామూలు సైకిళ్లు కాదు. ఎలక్ట్రిక్ సైకిళ్లు. అంటే ఆయన తన ప్లాన్‌లో టెక్నాలజీని యాడ్ చేసుకున్నారనుకోవచ్చు .. ఎలక్ట్రికల్ సైకిల్ మోడళ్లను ముఖ్యమంత్రికి చూపించడంతో పాటు పలు అంశాలపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎపిని బెస్ట్ ఎనర్జీ ఎఫిషియంట్ (ఉత్తమ ఇంధన సామర్ధ్యం) రాష్ట్రంగా మార్చుతామన్నారు. ఇఇఎస్‌ఎల్‌తో గృహ నిర్మాణం, ఇంధన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ సహా పలు కీలక విభాగాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఆర్థికంగా, పర్యావరణ పరంగా లబ్ధిచేకూరేలా విధానాలు ఉండాలని, ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఆర్‌టిసిలోనూ పెద్దయెత్తున విద్యుత్ వాహనాలను ప్రమోట్ చేస్తున్నామని, ప్రభుత్వ భవనాల్లోనూ సోలార్ వినియోగం పెంచబోతున్నట్లు తెలిపారు.
ఎలక్ట్రిక్ సైకిళ్లు పర్యావరణానికి హాని చెయ్యవు. అంతేకాదు.. విద్యార్థులు త్వరగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్తారు. బస్సుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. అలాగే మహిళలు సైకిళ్లను ఉపయోగించుకొని త్వరగా గమ్య స్థానాలకు చేరతారు. అలాగే వారి ఉపాధి అవసరాలకు ఆ సైకిళ్లను ఉపయోగించుకుంటారు. . ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదల కోసం నిర్మించే ఇళ్లకు ఇంధన సామర్ధ్య విద్యుత్ పరికరాల్ని సబ్సిడీపై ఇవ్వాలనుకుంటున్నారు. తద్వారా పేదలకు నాణ్యమైన విద్యుత్ పరికరాల్ని తక్కువ ధరకే పొందగలరు. అలాగే సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ భవనాల్లో సోలార్ విద్యుత్‌ని వాడేలా ప్లాన్ చేస్తున్నారు.