CM Chandra Babu Naidu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు ఎలా మారాయో మనం చూశాం. ఇటీవల కలెక్టర్ సమావేశం జరగగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైన సదస్సుకు అన్ని జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కలెక్టర్ల సమావేశంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ముందుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కలిసి సమావేశం జరుగుతున్న మందిరానికి వచ్చారు. చంద్రబాబు వచ్చి తనకు కేటాయించిన సీట్‌లో కూర్చునే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఛైర్‌కు తెల్ల టవల్ ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.. దాన్ని చూసిన వెంటనే చంద్రబాబు వద్దని వారించారు.
వెంటనే ఆ టవల్ తొలగించాలని భద్రతా సిబ్బందికి సైగలు చేశారు. వెంటనే అక్కడున్న భద్రతా అధికారులు ఈ టవల్‌ను ఛైర్ నుంచి తొలగించారు.. అప్పుడు కానీ ఆయన ఆ కుర్చీలో కూర్చోలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పక్కన ఉండగానే ఈ సీన్ కనిపించింది.. ఆయన కూడా ఆసక్తిగా ఈ విషయాన్ని గమనించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉంటానని చెప్పారు. తన వల్ల ఎవరూ ఇబ్బందిపడకూడదని.. తన కాన్వాయ్ వెళ్లే సమయంలో సామాన్యుల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. వీలైనంత తక్కువ సమయం మాత్రమే ట్రాఫిక్ ఆపాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఒకేసారి 5నుంచి 10లక్షల మెుక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా హైదరాబాద్‌లో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అటవీ సంపద పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనమందరం వనభోజనానికి వెళ్దామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై అధికారులు సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.