ఒకప్పుడు మన పూర్వీకులు ఎంతో బలవర్ధకమైన ఆహారాన్ని తినేవారు. అందుకనే వారు 100 ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి రోగాలు రాకుండా నిక్షేపంగా బతికారు. కానీ ఇప్పుడు మనం పాటిస్తున్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారాల కారణంగా మనం చిన్న వయస్సులోనే రోగాల బారిన పడుతున్నాం. ముఖ్యంగా యుక్త వయస్సులోనే చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. దీంతో ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే హార్ట్ ఎటాక్ వస్తుంది. రక్త నాళాల్లో అది పేరుకుపోయి హార్ట్ ఎటాక్‌లను కలగజేస్తుంది. అయితే కొలెస్ట్రాల్ అంటే బరువుతో సంబంధం ఉండదు. సన్నగా ఉన్నప్పటికీ కొందరికి కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. దీంతో గుండె పోటు వస్తుంది. ఫలితంగా చిన్న వయస్సులోనే ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.
అయితే శరరీంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఆహారంలో పలు మార్పులు చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవచ్చు. రక్తనాళాలు శుభ్రంగా మారుతాయి. కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలంటే పలు ఆహారాలను రోజూ తీసుకోవాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలంటే చేపలను, ఇతర సముద్రపు ఆహారాలను ఎక్కువగా తినాలి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి గుండెకు ఎంతగానో మేలు చేస్తాయి. రక్తనాళాల్లో ఉండే కొవ్వును కరిగిస్తాయి. దీంతో గుండె జబ్బులు రావు. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. అలాగే బాదంపప్పు, వాల్ నట్స్, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు తదితర ఆహారాలను కూడా రోజూ తీసుకోవాలి. వీటిల్లోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను కరిగించడంతోపాటు గుండె పోటు రాకుండా చూస్తాయి.
ఇక రోజూ ఒక దానిమ్మ పండును తినడం లేదా అదే పండుతో చేసిన ఒక గ్లాస్ జ్యూస్‌ను తాగడం వల్ల కూడా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే నారింజ పండ్లను, వాటి జ్యూస్‌ను తాగవచ్చు. ఇంకా స్ట్రాబెర్రీలను కూడా రోజూ తినవచ్చు. ఇవన్నీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే బ్రొకొలి, సోయా విత్తనాలు, పాలకూర, ఆలివ్ ఆయిల్, తృణ ధాన్యాలు తదితర ఆహారాలను రోజూ తీసుకుంటూ ఉండాలి. ఇవి గుండెను సంరక్షిస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో గుండె పోటు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.