Chiranjeevi : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరిని వరించింది. మెగాస్టార్ చిరంజీవితోపాటు.. మాజీ ఊపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఈ అవార్డును ప్రకటించింది కేంద్రం. దీంతో వీరిద్దరికి సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో పద్మ విభూషణ్ అవార్డ్ కేవలం అక్కినేని నాగేశ్వరరావుకి మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఈ అవార్డ్ అందుకున్న హీరో మెగాస్టార్ కావడం విశేషం. వీరికి మాత్రమే కాకుండా భాషతో సంబంధం లేకుండా సినీ పరిశ్రమలో చాలా మంది సినీ ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు.
అయితే పద్మ అవార్డులపై చాలా మందిలో అనేక అపోహలు ఉన్నాయి. పద్మ అవార్డులు అందుకున్న వారికీ నగదు బహుమానాలు, అనేక రాయతీలు దక్కుతాయని భవిస్తూ ఉంటారు. అయితే అలాంటిది ఏమీ ఉండదు. పద్మ అవార్డు అనేది కేవలం గౌరవం మాత్రమే. పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా దక్కే నగదు, ఇతర రాయతీలు ఏమీ ఉండవు. చాలా మంది అనుకుంటున్నట్లు రైళ్లలో, విమానాల్లో రాయతీలు ఉండవు. కేంద్ర ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్ తో దక్కిన గౌరవం పద్మ విభూషణ్ అవార్డు. పద్మ అవార్డు దక్కిన వారి రాష్ట్రపతి భవన్ లోకి వెళ్లి రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి సంతకం ఉన్న సర్టిఫికెట్, ఒక పతకం అందజేస్తారు. వీరికి దేశమంతా గుర్తింపు, గౌరవం దక్కుతాయి అంతే. 2006లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చిరంజీవికి గౌరవ డాక్టరేట్ దక్కింది.
ఇక మొదట ఏ సినిమాలో చిన్న చిన్న పాత్రలు వచ్చినా, నెగటివ్ రోల్స్ వచ్చినా ప్రతి పాత్రను నటించేవారు చిరంజీవి. ఆ తర్వాత తన డాన్స్ తో, తన నటన కౌశలంతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి. ఖైదీ ముందు చిరంజీవి చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఖైదీ సినిమా, ఆ తరువాత చిరంజీవి చేసిన సినిమాలు మరో ఎత్తని చెప్పాలి.