Chiranjeevi : ఏపీలో ఈ సారి ఎన్నికలు మంచి రంజుమీద ఉన్న విషయం తెలిసిందే. చివరి వరకు ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం చాలా కష్టం. జనసేన, వైసీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడి వైసీపీని గద్దె దించె ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ సారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా ఉంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్డీయే కూటమి, మెగా ఫ్యామిలీ కష్టపడుతుంటే.. పవన్‌ను ఓడించే లక్ష్యంతో వైసీపీ వ్యూహలు రచిస్తోంది. ఈక్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగారు. తమ్ముడిని గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు. ఎవరైనా సరే అధికారం వచ్చాక ప్రజలకు సాయం చేస్తారని, కానీ తన తమ్ముడు మాత్రం సొంత డబ్బులతో కౌలు రైతులను ఆదుకున్నాడని చెప్పుకొచ్చారు. తన తమ్ముడు లాంటి నాయకులే కదా జనాలకు కావాలని అన్నారు.
ఏ తల్లికైనా సరే తన కొడుకు కష్టపడుతుంటే బాధగా ఉంటుందని, తమ్ముడి అకారణంగా తిడుతుంటే బాధగా ఉంటుందని చిరు అన్నారు. తన తల్లి బాధ పడుతుంటే.. అమ్మకు ఒకటే మాట చెప్పారట. ఎంతో మంది తల్లుల కోసం, బిడ్డల కోసం చేస్తున్న ఈ పోరాటంలో.. మన బాధ పెద్దది కాదు అని అన్నారట. తన తమ్ముడిలాంటి నాయకులను చట్ట సభలకు పంపించాలని.. జన సేనకు ఓటు వేయండని మెగాస్టార్ కోరారు.అమ్మ కడుపున ఆఖరిగా పుట్టినా.. అందరికీ మేలు చేయాలి.. అందరికీ మేలు జరగాలి అనే విషయంలో ముందుంటాడు.. తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌ది అని కొనియాడారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారనీ, తన తమ్ముడు మాత్రం సొంత డబ్బుని ఖర్చు పెట్టి కౌలు రైతులను ఆదుకున్నాడని అన్నారు.
అన్యాయాన్ని ఎదురించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లే ప్రజాస్వామ్యం మరింత నష్టపోతోందని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు.. బలంగా నమ్మిన సిద్దాంతం కోసం జీవితాన్ని రాజకీయం కోసం అంకితం చేసిన శక్తిశాలి.. ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభలో ఆ గొంతు వినిపించాలి .. పవన్ కళ్యాణ్‌ని గెలిపించండి.. మీకు సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు..కలబడతాడు.. పిఠాపురం వాస్తవ్యులకు నమస్కారం, గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి.. గెలిపించండి.. జై హింద్.. అని చిరంజీవి వీడియోని ముగించారు.