Chicken Sales : ఈ రోజుల్లో ముక్క తగలనిది మందు దిగడం లేదు. అయితే చికెన్‌కి సంబంధించి పలు వెరైటీలు ఆరగించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వదిలిపోయిందన్ని ఈ వైరస్ రక్కసి మళ్లీ జన సంచారంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా జార్ఖండ్‌లో సైతం బర్డ్ ఫ్లూ కేసులు విజృంభించాయి. రాష్ట్ర రాజధాని రాంచీలోనే అత్యధికంగా కేసులు నమోదుకావడంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. హోత్వార్ ప్రాంతంలోని రీజనల్ పౌల్ట్రీ ఫామ్‌లో 2,196 పక్షులతో పాటు 1,745 కోళ్లు మృత్యువాతపడ్డాయి. అనుమానిత 1,697 గుడ్లను అధికారులు పగలగొట్టారు. భోపాల్‌లోని ఓ ల్యాబొరేటరీలో కోళ్ల నమూనాలను పరీక్షించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా H5N1 నమూనాలో వైరస్ నిర్ధారణ అయింది.
ఈ వైరస్ వల్ల పక్షులు బర్డ్ ఫ్లూ బారిన పడుతుండడంతో చాలా కోళ్లు అనారోగ్యానికి గురై మృతి చెందుతున్నాయి. వైరస్ వేరే జీవులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. వ్యాధి సోకిన కోళ్లను తింటే ప్రాణాలకే ప్రమాదం. బర్డ్ ఫ్లూ కేసులు బయటపడగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయిన ప్రాంతం నుంచి కిలోమీటరు పరిధిలో కోళ్లు, వాటికి సంబంధించిన ఉత్పత్తులు, గుడ్ల కొనుగోలు, అమ్మకం, రవాణాపై తక్షణమే నిషేధం విధించారు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ప్రభావిత ప్రాంతాల్లో నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. రాంచీ డిప్యూటీ కమిషనర్ రాహుల్ కుమార్ సిన్హా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో వెటర్నరీ అధికారులు, సిబ్బందిని నియమించారు.
వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. పౌల్ట్రీ ఫామ్‌లోని మిగిలిన కోళ్లను చంపి, పారవేసి ఆపై వైరస్ సోకిన ప్రాంతాన్ని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలని సూచించింది. వ్యాప్తి చెందే ప్రదేశం చుట్టూ ఒక కి.మీ వ్యాసార్థాన్ని ఇన్‌ఫెక్షన్ ఉన్న ప్రాంతంగా గుర్తించాలని, దాని చుట్టూ పది కి.మీ వ్యాసార్థాన్ని నిఘా జోన్‌గా గుర్తించాలని అధికారులకు సూచించారు. అయితే వ్యాధి వ్యాపించిన పౌల్ట్రీ ఫామ్‌కి 3 నెలల క్రితమే అనుమతులు లభించినట్లు అధికారులు తెలిపారు. ఏవైనా పక్షులు అనుమానాస్పదంగా మృతి చెంది ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పశుసంవర్ధక శాఖ ప్రజలకు సూచించింది.