Alli Arjun : ఇటీవలి కాలంలో మోసగాళ్లు ఎక్కువై పోయారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన జేబులు ఖాళీ చేస్తున్నారు. తాజాగా కూకట్‌పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్, హేమ, కొంగర సుమంత్ లు పలువురిని మోసం చేసి కోట్లు కొల్లగొనట్టు తెలుస్తుంది. బాధితుల ఫిర్యాదు మేరకు అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సినిమాల్లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పడంతో చాలా మంది వీరికి డబ్బులు ఇచ్చారు. ఇందులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ, డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేటల్, బోర్‌వెల్స్ పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నామని బాధితులకు చెప్పారు.
ఆర్‌ఆర్‌ఆర్, అలవైకుంఠపురం, లవ్ స్టోరీ, నిశ్శబ్ధం, వెంకీమామ, రాక్షసుడు, నాంది తదితర సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నామని, వాటి ద్వారా భారీగా లాభాలు వస్తాయని ఆశ చూపించారు. దాదాపుగా 30మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వారి బంధువుల నుంచి దాదాపుగా రూ. 6 కోట్లు వసూలు చేశారు. డబ్బులు తీసుకుని చాలా రోజులు అవుతున్నా తిరిగి ఇవ్వకపోవడంతో వారిని నిలదీశారు. దీంతో అప్పటి నుంచి వారు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరుల పేరు చెప్పి బెదిరించడం ప్రారంభించారు.
ఈ క్రమంలో భాదితులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసాలకు పాల్పడ్డ కొంగర అంజమ్మ చౌదరి, ఆమె కూతురు హేమ, కొడుకు కొంగర సుమంత్, నాగం ఉమా శంకర్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకొని.. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారులైన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్‌లను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బాధితులు తెలిపారు.