Chandrayan 3 : ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంతో యావత్ దేశం సంబరాలు చేసుకుంది. చంద్రుని ఉపరితలంపై రోవర్ పరిశోధనలు కూడా మొదలు పెట్టగా ఇస్రో అనేక విషయాలు షేర్ చేస్తూ వస్తుంది. రోవర్ జాబిల్లిపై చక్కర్లు కొడుతూ ఉపరితలంపై పరిశోధనలు చేస్తుంది. తాజాగా ప్రగ్యాన్ రోవర్ నుంచి కీలక అప్‌డేట్ అందింది. చంద్రుడిపై నమోదవుతోన్న వివిధ రకాల ఉష్ణోగ్రతలను ఇస్రోకు చేరవేసింది ప్రగ్యాన్ రోవర్. ఉపరితలం నుంచి పది సెంటీమీటర్ల లోతు వరకు టెంపరేచర్లు అబ్జర్వ్ చేయగా.. అందుకు సంబంధించిన గ్రాఫ్‌ను విడుదల చేసింది ఇస్రో.
చంద్రుడి ఉపరితలంపై 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పైగా ఉష్ణోగ్రత నమోదవగా.. ఉపరితలం నుంచి 10 సెంటీమీటర్ల లోతులో మైనస్ పది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనట్లు చెబుతున్నారు. తాజా అప్‌డేట్‌తో చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు చేసేందుకు మార్గం సుగమమైనట్టు చెబుతున్నారు. అయితే ఈ ఛేస్ట్ పేలోడ్‌ను స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, వీఎస్ఎస్‌సీ, అహ్మదాబాద్‌లోని పీఆర్ఎల్ సహకారంతో అభివృద్ధి చేసి, తయారు చేసినట్లు తెలిపింది. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపింది. చంద్రయాన్-3లో ఏడు పేలోడ్స్ ఉన్నాయి. విక్రమ్ ల్యాండర్‌పైన 4, ప్రజ్ఞాన్ రోవర్‌పైన రెండు ఉన్నాయి. మరొకటి ప్రొపల్షన్ మాడ్యూల్ పేలోడ్. వీటిని వేర్వేరు శాస్త్రీయ పరిశోధనల కోసం రూపొందించారు.
ఇక అప్పుడెప్పుడో చంద్రుడిపైకి వెళ్లి అక్కడే ఉండిపోయిన చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఇప్పుడు చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ ఫొటోలు తీస్తోంది. చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ ఉన్న చంద్రయాన్ 2 ఆర్బిటర్ తీసిన చంద్రయాన్ 3 ల్యాండర్ ఫొటోల్ని కూడా ఇస్రో ఎక్స్ లో షేర్ చేసింది. చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఫొటోషూట్స్ చంద్రయాన్ 3 ల్యాండర్ అంటూ పలు ఫొటోల్ని విడుదల చేసింది. మొత్తానికి ఓవైపు చంద్రయాన్ 3, మరోవైపు చంద్రయాన్ 2 పంపుతున్న పిక్స్ తో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు.