Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు గత కొన్నాళ్లుగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. వైసీపీ నాయకులపై విమర్శలు గుప్పిస్తూ రచ్చ చేస్తున్నారు.వైయస్సార్సీపీ ప్రభుత్వంలో స్కీములన్నీ స్కాములేనని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏర్పాటు చేసిన ‘రా.. కదిలిరా’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి సీఎం జగన్ మానసిక ఆందోళనలో ఉన్నారన్నారు. అన్యాయం చేసిన భస్మాసురుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు ఎమ్మెల్యే సీటును ఎర్రచందనం స్మగ్లర్‌కు కేటాయించారని చంద్రబాబు నాయుడు విమర్శించారు.
అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలంలో ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో ఇటీవల పోలీసు కానిస్టేబుల్ గణేష్ మరణించిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో స్మగ్లర్లు రాజ్యమేలుతుంటే పోలీసుల వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. 16 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను ఆకర్షించి, ఐదు సంవత్సరాలలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంలో టీడీపీ సాధించిన విజయమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 11 జిల్లాల సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) పరీక్షల ద్వారా 1,50,000 ఉద్యోగాలు కల్పించిందని ఆయన పేర్కొన్నారు. ఇక రోజా గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు.
రోజా మా మీద బురద జల్లడమే కాని ఏ రోజైన ప్రజలకి సేవ చేసిందా అని ప్రశ్నించారు. దున్నపోతులా మెక్కి పబ్బుల్లా డ్యాన్స్ చేస్తుందని చంద్రబాబు కామెంట్స్ చేసినట్టు కొన్ని వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. దళితుల మృతదేహాలను వైఎస్‌ఆర్‌సీపీ డోర్ డెలివరీ చేసిందని, టీడీపీ దళిత నేత బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేసి వారికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చంద్రబాబు అన్నారు. జగన్ రెడ్డిని దళిత ద్రోహి అని ప్రస్తావిస్తూ.. దళితుల కోసం టీడీపీ ప్రారంభించిన 27 పథకాలను నిలిపివేయడంపై ప్రస్తుత సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లలో దళితులపై 6 వేల కేసులు పెట్టారని, దీంతో 188 మంది మృతి చెందారని వైఎస్‌ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.