Chandrababu : మాజీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన రా… కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘చింతలపూడి సభ చూస్తుంటే… గెలిచేది మనమేనని, ఇందులో అనుమానం లేదనిపిస్తుంది. మరో రెండు నెలల్లో సైకో జగన్‌ను ఇంటికి పంపాల్సిందే. యువత మొత్తం తెలుగుదేశం, జనసేనలోనే ఉన్నారు. మీరు తలుచుకుంటే మన విజయాన్ని ఆపే దమ్ము ఎవరికీ లేదు. ఈ గెలుపు మనకోసం కాదు. ఒక కుటుంబ పెద్ద తాగుబోతు అయితే ఆ కుటుంబం చితికిపోతుంది. రాష్ట్ర పెద్ద సైకో అయితే అంతా సర్వనాశనం అవుతుంది. జగన్ రెడ్డి దిగిపోవడం కాదు.
ప్రజలే జగన్ ని బరించే స్థితిలో లేరు. రాష్ట్ర ప్రజలను రూ.12 లక్షల కోట్లు అప్పుల్లో ముంచాడు. జగన్ నాశనం చేసిన రాష్ట్రాన్ని పున:నిర్మించుకోవడంలో మీ అందరి సహకారం కావాలి’ అన్నారు చంద్రబాబు. జగన్ తాను అర్జునుడితో పోల్చుకుంటున్నారు.. ముమ్మాటికీ ఏపీ సీఎం అక్రమార్జనుడేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పులివెందుల కుటుంబ పంచాయతీని రాష్ట్ర సమస్యగా చేయాలని చూస్తున్నారని.. కేసుల నుంచి బయటపడేందుకు తండ్రి వైఎస్ పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టించిన ఘనుడు జగన్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఇదే వేదికపైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గాంధీ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీలో దళితులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా తన పదవికి, పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు ఆర్ గాంధీ తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులు, బీసీలపై దాడులు పెరగడంతో పాటు రాజకీయంగా ఆ వర్గాలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. తాను దళితుడిని కావడం వల్లనే పార్టీ, మంత్రి పెద్దిరెడ్డి తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. నియోజకవర్గ సమస్యలను సీఎం జగన్‌కు విన్నవించడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సీఎం కార్యాలయ అధికారులను వేడుకున్నా స్పందించక పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యానన్నారు. అవన్నీ భరించలేక గాంధీ..టీడీపీలో చేరారు.