Chandra Babu : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రెండు నెలల తర్వాత బయటకు రావడం, ఆతర్వాత కంటి ఆపరేషన్ చేయించుకొని కొన్నాళ్లపాటు ఇంట్లో విశ్రాంతి తీసుకొని ఇప్పుడు తిరిగి జనాలలోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు తిరుమల శ్రీవారిని చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారు కాపాడారన్నారు. కష్టం వచ్చినప్పుడు స్వామి వారిని మొక్కకున్నానన్నారు. ధర్మాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్ధించానన్నారు. భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని.. తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ 1 గా ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే శక్తి సామర్థ్యలు ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నానన్నారు. త్వరలోనే తన కార్యాచరణ ప్రకటిస్తానని.. చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
శ్రీవారి పాద పద్మాల చెంత పుట్టి.. అంచెలంచెలుగా ఎదిగానని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.శ్రీవారిని దర్శించడానికి గురువారం రాత్రే ఆయన తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. ఈ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. తన భవిష్యత్ ప్రణాళికలను వివరించడానికి నిరాకరించారు.వెంకటేశ్వర స్వామి తమ ఇంటి దైవం, అని ఆయనను తలచుకుని ఏ కార్యక్రమం అయినా ప్రారంభిస్తానని చెప్పారు.
చంద్రబాబు కాన్వాయ్ కొండపైకి చేరుకోకముందు తెలుగుదేశం నేతలు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఎక్కువమంది నాయకులు రావడంపై వారు అభ్యంతరం తెలిపారు. జాబితాలో ఉన్నవారినే అనుమతి ఇస్తామని చెప్పడంతో వివాదం మొదలైంది. మాజీమంత్రి అమరనాథరెడ్డి జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. తిరుమలలో శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్న సమయంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. భక్తులు జై చంద్రబాబు అంటుంటే.. ఇది పవిత్ర తిరుమల, గోవింద నామస్మరణ మాత్రమే చేయాలని చంద్రబాబు సైగలు చేశారు. దీంతో భక్తులు ఆ నినాదాలను ఆపేసి.. గోవింద నామ స్మరణ చేశారు. చంద్రబాబు భక్తుల్ని ఆప్యాయంగా పలకరించారు.