Chandra Babu : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కాం డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి 52 రోజుల పాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే.తాజాగా ఆయన అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు. మంగళవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో జైలు నుంచి బయటకు అడుగు పెట్టడంతో అధినేతను చూసి పార్టీ నేతలు, కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు గేటు నుంచి బయటకు రాగానే మనవడు దేవాన్ష్‌ను దగ్గరకు తీసుకుని హత్తకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, పార్టీ నేతల్ని ఆప్యాయంగా పలకరించారు. జైలు దగ్గర కొద్దిసేపు ఎమోషనల్ సీన్ కనిపించింది.
జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే నారా బ్రాహ్మణి, నందమూరి బాలయ్యలు చంద్రబాబుకు ఓ పసుపు సంచిని అందజేశారు. దీంతో ఆ సంచిలో ఏముందనే చర్చ జరిగింది.. ఆ తర్వాత ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. నందమూరి బాలయ్య చంద్రబాబు క్షేమం కోరుతూ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాడులోని ఆలయాల్లో కూడా ప్రత్యేకంగా పూజలు చేయించారు. ఈ క్రమంలో తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాల్లో సోమవారం చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు చేయించిన నందమూరి బాలయ్య.. ఆ ఆశీర్వాద ఫలాన్ని అధినేతకు అందజేశారు. అనంతరం చంద్రబాబుకి పాదాభివందనం చేశారు బాలయ్య. రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబుకు దారి పొడవునా తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు టిడిపి శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు అంటూ పేర్కొన్న ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చూపించిన మద్దతు ఎప్పటికీ మరిచిపోను అన్నారు. మీరు చూపిస్తున్న అభిమానాన్ని మర్చిపోలేనని పేర్కొన్న చంద్రబాబు రోడ్డుపైకి వచ్చి మీరు తెలిపిన సంఘీభావం, నా కోసం మీరు చేసిన పూజలు ఎప్పుడు మరిచిపోను అన్నారు. తనకు సంఘీభావం తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతును కొనియాడారు. సీపీఐ, బీఆర్ఎస్, కొంత మంది కాంగ్రెస్ నాయకులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. 53 రోజుల జైలు జీవితంలో తాను అభివృద్ధి కోసం చేసిన పనులను, నాటి కష్టాన్ని నేమరువేసుకున్నానని అన్నారు.