Chandra Babu : విరామం తర్వాత చంద్రబాబు తిరిగి ప్రజలలోకి వచ్చారు. ఆయన తెలంగాణలో టీడీపీని రంగంలోకి దింపకపోవడం వలన బీఆర్ఎస్ ఓడిందనే ఓ టాక్ వినిపిస్తుంది. చంద్రబాబుకి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఇప్పుడు ఆయన కేసీఆర్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడని అంటున్నారు. ఇక 2024 ఎన్నికలలో జగన్‌కి కూడ చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం అంటున్నారు. అయితే చంద్రబాబు రైతులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని అందువల్లే అధిక నష్టం జరిగిందన్నారు చంద్రబాబు.
అహంకారం ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని ఉద్దేశించి పరోక్ష విమర్శలుచేశారు.ఏపీలో కూడా జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉందన్న చంద్రబాబు ఏపీలో కూడా ప్రజలు ఆలోచించి తీర్పు ఇస్తారని చెప్పకనే చెప్పారు.ఏపీలో ప్రజల కష్టాలు మరో మూడు నెలలే అన్న చంద్రబాబు..తర్వాత ఇలాంటి పరిస్థితులు ఉండవని భరోసా ఇచ్చారు. టీడీపీ చీఫ్ కామెంట్స్ చూస్తుంటే ఏపీలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని స్పష్టంగా రైతులకు, ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. అధికారంలోకి రాగానే కాలనీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. టీడీపీ తరఫున ఒక్కో ఇంటికి రూ. 5 వేలు సాయం అందిస్తున్నామన్నారు.
సీఎం జగన్‌కు బంగాళ దుంపలకు, ఉల్లిగడ్డలకు తేడా తెలియడం లేదన్న చంద్రబాబు.. ఇలాంటి వ్యక్తికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. హుద్‍హుద్ తుపాను సమయంలో విశాఖలో మకాం వేసి మరీ తాను పరిస్థితులు చక్కదిద్దినట్లు చెప్పారు.వైసీపీ మంత్రులు సాధికార యాత్రల పేరుతో అటూ ఇటూ తిరుగుతున్నారన్న చంద్రబాబు.. వైసీపీ నేతల మాటలు కోటలు దాటుతాయి కానీ.. చేతలు గడపకూడా దాటవని ఎద్దేవా చేశారు. వైసీపీ చేతకాని పాలనతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల నుంచి పంట కాలువలు బాగుచెయ్యకుండా ప్రభుత్వం ఏం చేస్తోందన్న టీడీపీ అధినేత.. సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే నేడు రైతులు నష్టపోయేవారా అని ప్రశ్నించారు.