Chandra Babu : ఒకే ఒక్క ఛాన్స్ అని గద్దెనెక్కి కూర్చున్న జగన్ ప్రజలకి చేసింది ఏమి లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చంద్రబాబు నంద్యాల జిల్లాలో పర్యటించి మచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించారు. టీడీపీ హయాంలో జరిగిన పనులు, నేటి పెండింగ్ పనులపై టీడీపీ నేతలు చంద్రబాబుకు వివరించారు. ఇక నందికొట్కూరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ…. సీఎం జగన్ రాయలసీమకు అన్యాయం చేశారని ఆరోపించారు. అలగనూరు రిజర్వాయర్‌లో చుక్క నీరు లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుల్లో నీళ్లు లేకుండా చేసిందన్నారు.
జగన్ పరదాల చాటున దాక్కొని వెళ్లడం కాదని, ధైర్యం ఉంటే నందికొట్కూరు పటేల్ సెంటర్‌కు రావాలని చంద్రబాబు సవాల్ చేశారు. ఏపీ ప్రజల భవిష్యత్తు నాశనం చేసిన వైసీపీని భూస్థాపితం చేయాలని చంద్రబాబు అన్నారు. జీవో.365 ద్వారా 198 సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం ప్రీక్లోజర్ చేసిందని ఆరోపించారు. కర్నూలు జిల్లాలో శ్రీశైలం జలాశయం ఉన్నా రాయలసీమకు నీళ్లు అందని పరిస్థితి నెలకొందని చంద్రబాబు అన్నారు. నందికొట్కూరులో ఎమ్మెల్యేను కూడా లెక్క చేయని ఓ వైసీపీ నేత విర్ర వీగుతున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. రౌడీయిజం చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
మాటలు కాదు అభివృద్ధి చేసి చూపాలని సవాల్ చేశారు. ఎవరైనా రౌడీయిజం చేస్తే తాట తీస్తానంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఊరికో రౌడీ తయారయ్యాడని ఆయన విమర్శించారు. ఇలాంటి వారిని మురికి కాలువల్లో వేసి తొక్కితే దరిద్రం పోతుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో ప్రాజెక్టుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. నీటి ప్రాజెక్టులపై జగన్ చర్చకు సిద్ధమా? అని చంద్రబాబు సవాల్ చేశారు. రాయలసీమకు చేసిన అన్యాయం ఒప్పుకొని సీఎం జగన్ నేలకు ముక్కు రాయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలు-గుంటూరు జాతీయ రహదారికి గుంతలు పడితే కనీసం మట్టి వేయలేకపోయారని, వీళ్లు మూడు రాజధానులు కడతారంట అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌కు ఇదే చివరి అవకాశం అన్నారు.