Chandra Babu : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ఫ్రత్యేక హోదా అంశం మరోసారి హట్ టాపిక్‌గా మారింది. కొన్నాళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు డిమాండ్ చేస్తుండగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా చంద్రబాబు, నితీష్ మారడంతో ఈ అంశం ఆసక్తిగా మారింది. కేంద్రంలో బీజేపీ 240 స్థానాలే సాధించి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితిలో, తెలుగు దేశం పార్టీ (16 ఎంపీ సీట్లు ), జేడీ (యూ) (12 ఎంపీ సీట్లు) మద్దతు ఆ పార్టీకి అనివార్యంగా మారింది. ఈ క్రమంలో చంద్రబాబు మరోసారి కేంద్రంలో కింగ్ మేకర్ అయ్యారు. అతనికి కన్వీనర్ పదవి ఇచ్చే అవకాశం కూడా ఉందని టాక్.
2014 లో కేంద్రంలో యూపీఏ కూటమి ఓటమి పాలై ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చింది. అదే సమయంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా.. ఆ తర్వాత 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయాయి. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని దాదాపుగా తేల్చేసింది. అయితే అప్పుడు సొంతంగా బీజేపీకి మెజార్టీ ఉండటంతో వారు ఏది చెప్పిన చెల్లింది. కాని ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉండడంతో ఏపీకి ప్రత్యేక హోదా సాధించే అవకాశం చంద్రబాబు నాయుడుకు దక్కింది.
పేదరికం, ఆర్థికంగా వెనుకబడడం అనే కారణాలతో తమకు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచోఏపీ, బీహార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేయాలన్నా.. నరేంద్ర మోదీ.. మరోసారి ప్రధానమంత్రి కావాలన్నా కూడా.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ.. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలకు సంబంధించిన ఎంపీలే కీలకం కాబోతున్నారు. అయితే ఇప్పుడు మోదీకి సపోర్ట్ చేయాలంటే.. ఏపీ, బీహార్‌లు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను కేంద్రం ముందు ఉంచే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ సారైన ఏపీకి ప్రత్యేక హోదా వస్తే అంతకి మించిన ఆనందం మరొకటి ఉండదు.