Chandra Babu : టీడీపీ అధనేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని సెప్టెంబర్ 9వ తేదీన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో వైసీపి ప్రభుత్వం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10 నుంచి సుమారు రెండు నెలలు జైలులో నిర్బందించి ఉంచడంతో, ఆయన గురించి వార్తాలే తప్ప ప్రజలకు కనబడలేదు. చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్ కోసం అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కొన్ని గంటల సేపు మాత్రమే ఆయన ప్రజలకు కనబడ్డారు. కంటి ఆపరేషన్ కారణంగా బయటకు రాలేదు. నవంబర్ 20వ తేదీన హైకోర్టు చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. వైసీపి ప్రభుత్వం హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లింది కానీ అక్కడా దానికి ఎదురుదెబ్బ తగిలింది.
ఈ నెల 28వ తేదీ నుంచి ఆయన రాజకీయ సభలు, సమావేశాలకు హాజరయ్యేందుకు కూడా సుప్రీంకోర్టు అనుమతించడం వైసీపి ప్రభుత్వం జీర్ణించుకోవడం చాలా కష్టమే. చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం నిన్న సాయంత్రం రేణిగుంట చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో వచ్చారు. రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. టీడీపీ అధినేత రాకతో విమానాశ్రయం వద్ద భారీ కోలాహలం నెలకొంది.
టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. చంద్రబాబు రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో అరెస్ట్ కావడం, సుమారు రెండు నెలలు జైల్లో ఉండటం ఓ పీడకల వంటిది. కనుక టిడిపికి పట్టిన వైసీపి చీడపీడలన్నీ వదిలిపోవాలంటే దైవానుగ్రహం కూడా అవసరం. అందుకే చంద్రబాబు నాయుడు ప్రజల మద్యకు వచ్చే ముందు దైవదర్శనం చేసుకుంటున్నారు. మరో నాలుగైదు రోజులలో చంద్రబాబు నాయుడు ఇవన్నీ పూర్తిచేసుకొని ప్రజల మద్యకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నికల శంఖారావం పూరించి వైసీపితో యుద్ధానికి టిడిపి శ్రేణులను, ప్రజలను సిద్దం చేయనున్నారు. చంద్రబాబు నాయుడుని చూసి దాదాపు మూడు నెలలు కావస్తోంది. కనుక ప్రజలు కూడా ఆయన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.