కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో ప్రజలని సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తుంది. రీసెంట్‌గా మహిళల కొరకు కొత్త పథకాన్ని తీసుకువచ్చి శుభవార్త చెప్పింది. మహిళలు 3 లక్షల రూపాయల వరకు రుణం తీసుకుని, 88 రకాల చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం “ఉద్యోగిని. అవసరమైన అర్హతా ప్రమాణాలున్న దరఖాస్తుదారులు ఈ పథకం కింద రూ. 3 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే.. వైకల్యమున్న మహిళలు, వితంతువులకు రుణ పరిమితి లేదు. వారు నెలకొల్పే వ్యాపారం, వారి అర్హతలను బట్టి ఇంకా ఎక్కువ రుణం పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ కార్యక్రమ లక్ష్యాల్లో మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం ఆర్థిక సహాయం అందించడమూ కూడా ఒకటి. మహిళలు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగి తమ కాళ్లపై తాము నిలదొక్కుకోవడానికి ప్రవేశపెట్టిన పథకమే ఈ ఉద్యోగిని. ఈ పథకాన్ని మొదట కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ.. తరువాత కేంద్ర ప్రభుత్వం దీన్ని వుమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో దేశమంతటా అమలు చేస్తోంది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 48 వేల మంది మహిళలు లబ్ధి పొంది చిన్నపాటి పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
వికలాంగులు, వితంతువులు మరియు దళిత మహిళలకు పూర్తిగా వడ్డీ లేని రుణాలను అందిస్తుండగా, వివిధ వర్గాల మహిళలకు 10 శాతం నుండి 12 శాతం వరకు వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేస్తారు. పొందిన రుణాల్లో కుటుంబ వార్షిక ఆదాయాల ఆధారంగా 30 శాతం వరకు సబ్సిడీ మంజూరు చేస్తున్నారు. ఏదైనా మునుపటి రుణాలు సక్రమంగా తిరిగి చెల్లించబడని సందర్భంలో, వ్యక్తులు తదుపరి రుణాలను స్వీకరించడానికి అర్హులు కారు. 18 నుండి 55 సంవత్సరాల వయస్సులోపు ఉన్న ఏ మహిళా వ్యక్తి అయినా పాల్గొనడానికి అర్హులుగా పరిగణించబడతారు. ఈ పథకం కోసం మహిళా దరఖాస్తుదారులు తమ క్రెడిట్ స్కోర్ మంచి స్థితిలో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం.