Barrelakka : గత కొద్ది రోజులుగా బర్రెలక్క అలియాస్ శిరీష పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసిన బర్రెలక్క తన స్పీచ్‌తో అందరిని ఆకట్టుకుంది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ బర్రెలక్క.. కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా.. ఒంటరిగా నామినేషన్ వేసింది. ఆమె ధైర్యంగా వేసిన ముందడుగుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత, నిరుద్యోగులు, విద్యావేత్తల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల పోలింగ్ ముగియడంతో బర్రెలక్కకి ఎన్ని ఓట్లు పడి ఉంటాయని చర్చలు జరుపుతున్నారు. బర్రెలక్కకు జనం ఎంత మంది ఓటుతో మద్దతు ఇచ్చారన్నది మాత్రం ఆసక్తికరం.
బర్రెలక్క మాకు ఏమాత్రం పోటీ కాదు.. ఆమె వల్ల కేవలం ఒకటి నుంచి రెండు వేల ఓట్లు మాత్రమే అటూ ఇటూ అవుతాయి తప్ప.. పెద్దగా ప్రభావం చూపలేదు.. ఆమెను అసలు లెక్కలోకి తీసుకోవాల్సిన పని కూడా లేదు.. అంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు కామెంట్ చేశారు. కానీ.. ఆరా మస్తాన్ విడుదల చేసిన సర్వే ఫలితాల ప్రకారం.. బర్రెలక్కకు ఏకంగా 10 నుంచి 15 వేల ఓట్లు వస్తాయని తేలింది. శిరీష గెలవకపోయినా గట్టి పోటీ ఇస్తుందని, ఓటర్లను ఆమె పెద్ద సంఖ్యలో ఆకర్షించుకోగలిగిందని పేర్కొంది. ఇక ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపొందనున్నారని విశ్లేషించింది.
ఈ సర్వే ఫలితాలను బట్టి బర్రెలక్క గట్టిగానే ప్రభావం చూపినట్టు అర్థమవుతోంది. 2018 ఎన్నికల్లో అప్పడు బీఆర్ఎస్‌లో ఉన్న జూపల్లి కృష్ణా రావుపై కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కేవలం 12,546 ఓట్లతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి సుధాకర్ రావుకు 13,156 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అయితే.. ఈసారి అనూహ్యంగా బర్రెలక్క బరిలోకి దిగగా.. ఆమెకు 10 నుంచి 15 వేల ఓట్లు రావటమంటే.. నైతికంగా ఆమె గెలిచినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఓట్లతో కొల్లాపూర్ ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు.