Bhumana Karunakar Reddy : తిరుమల తిరుపతిలో చిరుత నాలుగేళ్ల చిన్నారి లక్షితను చంపేసిన ఘటన అందరిని కలిచి వేసింది. ఆ మార్గంలో వెళ్లాలంటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇక ఈ ఘటన తర్వాత అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.మెట్ల మార్గంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి వెళ్లే వారికి కర్రతో పాటు సెక్యూరిటీ, రోప్ పార్టీలను కూడా వారి వెంట పంపుతున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన చెప్పారు. వన్య మృగాల దాడుల నుంచి కాపాడుకోడానికి భక్తుల చేతికి కర్రలివ్వాలనే టీటీడీ నిర్ణయంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంపై ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. శాస్త్రీయ పరిశీలన తర్వాత కర్రలివ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.
గురువారం ఉదయం అలిపిరి నడక మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కుకున్నట్లు తెలిపారు. దీనిని మగ చిరుతగా గుర్తించామని వివరించారు. భక్తుల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వివరించారు. భక్తులకు కర్రలు ఇవ్వాలన్న అటవీ అధికారులు ఆదేశాలతోనే అందరి చేతికి కర్రలు ఇస్తున్నామని ఆయన వివరించారు. అంతేకానీ కేవలం కర్రలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని సోషల్ మీడియాలో వస్తున్న దానిలో వాస్తవం లేదని ఆయన వివరించారు. ఇలాంటి నిందలు వేయడం సమంజసం కాదని ఆయన అన్నారు.
![Bhumana Karunakar Reddy : పులి వస్తే కర్రతో కొట్టండి.. తప్పేముందన్న టీటీడీ చైర్మన్.. Bhumana Karunakar Reddy given clarity on giving stick to pilgrims](http://3.0.182.119/wp-content/uploads/2023/08/bhumana-karunakar-reddy.jpg)
భక్తుల చేతికి కర్రను ఇవ్వడం మీద శాస్త్రీయ అధ్యయనం చేసిన వారు కూడా దానిని వినియోగంతో లాభాలు ఉంటాయని ధృవీకరించారని ఆయన అన్నారు. ఎత్తుగా ఉన్న వారిపై పులులు దాడి చేయవని, మనిషి కంటే ఎత్తుగా ఉన్న వాటి జోలికి అవి వచ్చే అవకాశాలు ఉండవన్నారు. భక్తులకు ఉపశమనం కల్పించడంలో భాగంగానే సెక్యూరిటీతో పాటు భక్తుల చేతిలో కర్ర ఉంచుతున్నట్లు చెప్పారు. పులుల్ని నియంత్రించే చర్యలు పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని, మరిన్ని చిరుతలు బంధించేలా కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.